గంజాయి స్మగ్లింగ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి అల్లుడు పట్టబడినట్లు వస్తున్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ నాయకుడి కుమారుడు గతంలో నకిలీ ఎస్ఐ అవతారమెత్తి పోలీసులకు పట్టుబడగా, తాజాగా అతని అల్లుడు గంజాయిని అక్రమ రవాణా చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడినట్లు మరాఠీ పత్రికల్లో వార్తలు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెడితే…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి అల్లుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఇతనితోపాటు మరో వ్యక్తి రెండు కార్లలో రూ. 31 లక్షల 15 వేల 170 రూపాయల విలువైన 103 కిలోల 839 గ్రాముల గంజాయిని 51 ప్యాకెట్లలో రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. గడ్చిరోలి మీదుగా చంద్రాపూర్ కు ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా చిచ్ పల్లి గ్రామ సమీపంలో శనివారం స్థానిక క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకుని వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ప్రభుత్వ టీచర్ తోపాటు మరో వ్యక్తి మంథని పట్టణంలోని సుభాష్ నగర్, మసీద్ వాడకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ కింద థానే రాంనగర్ లో కేసు నమోదు చేశారు. స్థానిక క్రైం బ్రాంచ్ సీఐ బాలాసాహెబ్ ఖాడేకు సమాచారం రాగా చిచ్ పల్లి సమీపంలోని షేర్-ఏ పంజాబ్ ధాబా వద్ద కాపు కాసి గంజాయిని పట్టుకుని, కార్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే గంజాయి అక్రమ రవాణా కేసులో మంథని నియోజకవర్గానికి చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడి అల్లుడు నిందితునిగా ఉండడం ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఈ నేత కుమారుడు నకిలీ ఎస్ఐ అవతారమెత్తి పోలీసులకు పట్టుబడ్గాడు.
ఫొటో: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన టీఆర్ఎస్ నేత అల్లుడు (కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తి)