బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్ను మూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. పార్లమెంటుకు 1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలో జంగారెడ్డి ఒకరు కావడం విశేషం. హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు.
జంగారెడ్డి మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు సత్యపాల్ రెడ్డికి ప్రధాని ఫోన్‌చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జంగారెడ్డికి ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సంతాపం ప్రకటించారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎం.పీ చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవీ జంగారెడ్డి జీవిత విశేషాలు:
• దక్షిణాది రాష్ట్రాల నుంచి 1984లో ఎన్నికైన ఏకైక బీజేపీ ఎంపీ జంగారెడ్డి.
• కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది. 1954 నుంచి జనసంఘ్ లో, బీజేపీలో పనిచేస్తున్నారు.
• తేదీ. 8.6.1935లో వరంగల్ జిల్లా పరకాలలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
• 5.2.2022న మరణించిన జంగారెడ్డికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
• నైజాం స్టేట్ లో ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. విద్యార్థిగా నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు.
• స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తూ, నిరుపేద ప్రజలకు అండగా నిలిచారు.
• వారికి సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా కావలసిన రక్షణ కల్పించారు.
• తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకించిన జంగారెడ్డి, ఆ ఉద్యమంలో పాల్గొన్నారు.
• విశాలాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమించి, ఫజల్ అలీ కమిషన్ కు మెమోరాండం సమర్పించారు.
• అదే సమయంలో పరకాలలో ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలకు జంగారెడ్డి ఆకర్షితులయ్యారు.
• జంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో హిందీ అధ్యాపకుడిగా కూడా పనిచేశారు.
• జంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు.
• అటల్ బిహారీ వాజపేయి, దీన దయాళ్ ఉపాధ్యాయ, సుందర్ సింగ్ బహుగుణ, కుష్ భవ్ థాక్రే, జగన్నాథరావు జోషీ, యాదవరావు జోషి తదితర ప్రముఖుల వ్యక్తిత్వాల పట్ల జంగారెడ్డి ఆకర్షితులయ్యారు.
• వరంగల్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా శాఖలు నిర్వహించారు.
• 1965లో ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు జంగారెడ్డి జనసంఘ్ లో చేరి, పరకాలలో ఆ పార్టీని విస్తరించారు.
• 1967లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రాజీనామా చేసిన జంగారెడ్డి, పరకాల నుంచి జన సంఘ్ అభ్యర్థిగా దీపం గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
• ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని మొత్తం గ్రామాలకు కరంటు సౌకర్యం కల్పించి, కరంటు జంగన్నగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు.
• ఆ సమయంలో గోవా లిబరేషన్ స్ట్రగుల్, కచ్ అగ్రిమెంట్ మూమెంట్ లో కూడా జంగారెడ్డి పాల్గొన్నారు.
• తిరువనంతపురంలో మల్లాపురం జిల్లా ఏర్పాటు ఉద్యమం, ఢిల్లీలో బంగ్లాదేశ్ గుర్తింపు ఉద్యమంలో పాల్గొన్నారు.
• 1976 ఎమర్జెన్సీ సమయంలో లోక్ జనసంఘర్ష్ సమితి, జయప్రకాశ్ నారాయణ్ గారి సూచనలతో జంగారెడ్డి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించారు.
• అదే సమయంలో జంగారెడ్డి సత్యాగ్రహ బృందాలను తయారు చేసి, నాయకత్వం వహించారు.
• జంగారెడ్డిని కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్గత భద్రతా చట్టం కింద ఏడాదిపాటు జైల్లో ఉంచింది.
• 1977లో జంగారెడ్డి ఎంపీగా పోటీచేశారు. 1978లో జనతా పార్టీ నుంచి శాయంపేట ఎమ్మెల్యేగా గెలిచి 1983 వరకు పనిచేశారు.
• 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా జంగారెడ్డి శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
• 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం ఎన్టీఆర్ గారి అభ్యర్థన మేరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సూచనలతో హన్మకొండ బీజేపీ ఎంపీగా పోటీ చేసిన జంగారెడ్డి, మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావును ఓడించారు.
• ఆ సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. 1. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ నుంచి జంగారెడ్డి 2.ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎ.కే.పాటిల్.
• దక్షిణాది రాష్ట్రాల్లో 1980లో బీజేపీ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా ఎంపికైన బీజేపీ ఎంపీ జంగారెడ్డి మాత్రమే.
• రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ‘‘ హమ్ దో.. హమారే దో’’ అని నినదిస్తూ, ఎన్నో జాతీయ సమస్యలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని జంగారెడ్డి నిలదీశారు.
• 1992 డిసెంబర్ 6న అయోధ్యలో రామజన్మభూమి సాధన ఉద్యమంలో ఆంధ్రా బ్యాచ్ కు నాయకత్వం వహించి బాబ్రీమసీదు కూల్చివేత ఘటనలో తమ బృందంతో క్రియాశీలక పాత్ర పోషించారు.
• 1999లో జంగారెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు.
• ఆర్ఎస్ఎస్, బీజేపీ విధేయుడైన జంగారెడ్డి ఏనాడూ శాఖ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయలేదు.
• తెలుగుదేశం పార్టీతో పొత్తు సమయంలో మిత్ర ధర్మానికి కట్టుబడిన జంగారెడ్డి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా 1999, 2004లో పోటీ చేయలేదు.
• అనంతరం 2009లో జంగారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు.
• ఆ తర్వాత కాలంలో విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించిన జంగారెడ్డి, తెలంగాణలోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో 40 కళాశాలలను నెలకొల్పిన విద్యావేత్తగా ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
• ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పి వేలాదిమంది గ్రామీణ యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో వాగ్దేవి విద్యాసంస్థల చైర్మన్ జంగారెడ్డి కృతకృత్యులయ్యారు. తన జీవితంలో మరుపురాని సంతృప్తి ఇది అని తరచూ ఆయన చెబుతుండే వారు.