కరోనా ‘థర్డ్ వేవ్’పై తెలంగాణా ప్రజారోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఈమేరకు ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ, వచ్చే సంక్రాంతి పర్వదినం తర్వాత కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని వెల్లడించారు. అయితే ఇదే దశలో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందన్నారు. మనం దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో రాష్ట్రంలోనూ గత రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. ఇదే దశలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతంగా శ్రీనివాసరావు చెప్పారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని, కానీ కేసుల పెరుగుదలపై ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
గత రెండు వేవ్‌ల్లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.