‘ఒమిక్రాన్’ ఓరుగల్లు మహానగరాన్ని కూడా తాకింది. హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. యూకే నుంచి వచ్చిన సుబేదారి ప్రాంతానికి చెందిన మహిళ ఒకరు ఒమిక్రాన్ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ జరిగినట్లు తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. అనవసర భయాందోళన అవసరం లేదని, మాస్క్ ధరించడం వంటి జాగ్రతత్తలు పాటించాలని కోరారు. కరోనా మూడో దశను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించారు.