తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరగనున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశముంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో కరోనాను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది.
కాగా ఈనెల 7వ తేదీ నుంచి 19 జిల్లాల్లో ప్రారంభించాలనుకున్న 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది