ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి గడచిన మూడు రోజులుగా కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ మన్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించిన ఆయా ప్రజాప్రతినిధి అకస్మాత్తుగా ఆచూకీ లేకుండా పోవడం భిన్న ఊహాగానాలకు తావు కల్పిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఈ ప్రజాప్రతినిధి ఎవరికీ చెప్పా పెట్టకుండా, చివరికి ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడం కలకలానికి దారి తీసింది. అతనికి రక్షణగా ఉన్న గన్ మెన్లు సైతం ఈ విషయంపై ఏమీ చెప్పలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మిస్సయిన నాయకుడి గన్ మెన్లు తమ ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదించినట్లు కూడా తెలుస్తోంది.
అకస్మాత్తుగా ఆచూకీ లేకుండాపోయిన ఈ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఓ హత్యోదంతంలోనూ తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కున్నారు. ఆయా హత్యోదంతంలో చార్జ్ షీట్ దాఖలుకు గడువు సమీపించడం, ఫోరెన్సిక్ నివేదిక తయారైందనే వార్తల నేపథ్యంలో ఈ నాయకుడి మిస్సింగ్ చర్చనీయాంశంగా మారింది. కాగా కర్నాటకలోని రాయచూర్ లో ఈ నేతకు ఓ స్నేహితుడు ఉన్నాడని, బహుషా అతనివద్దకు వెళ్లి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే దశలో మంత్రి ఈటెల రాజేందర్ తోనూ సన్నిహిత సంబంధాలు గల ఈ నాయకుడు భవిష్యత్ రాజకీయ పరిణామాలను అంచనా వేసి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. మొత్తంగా భిన్న ప్రచారాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేత ఒకరి మిస్సింగ్ ఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. పోలీసు వర్గాలు అతని ఆచూకీని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.