ఖమ్మం నగరంలో నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ, పదే పదే సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ను ప్రశ్నించడానికే తమ పార్టీ అవసరమని నిర్వచించారు. ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల చేసిన ముఖ్య వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

– రాజన్న బిడ్డను. రాజన్న అడుగు జాడల్లో నడిచేందుకు తొలి అడుగు వేస్తున్నాను.

– రాజన్నసంక్షేమ పాలన తిరిగి తేవాలని సంకల్పిస్తున్నాం. రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం.

– కోటి ఎకరాల సాగు లక్ష్యం రాజన్నదే. చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టు అందులో భాగమే.

– రీడైజింగ్ పేరుతో కేసీఆర్ ప్రాజెక్టు ఖర్చును పెంచారు. ఇది అవినీతి కాదా?

– రైతు పేరుతో లక్షల కోట్లు అప్పులు చేస్తూ పాలకులు జేబు నింపుకుంటున్నారు. ప్రశ్నించడానికే మన పార్టీ అవసరం.

– పేదరిక నిర్మూలనకే వైఎస్ఆర్ 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

– కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అన్నారు కేసీఆర్. ఏమైంది సారూ? ప్రశ్నించడానికే మన పార్టీ అవసరం.

– ఇంటికో ఉద్యగమన్నారు కేసీఆర్. నిరుద్యోగ భ్రుతి అన్నారు. ఏమైంది? జనం అనుకుంటున్నారు… ఆత్మహత్య చేసుకోకుంటే ఆ ఇంట్లో ఉద్యోగం రాదని అనుకుంటున్నారు.

– సీఎం కేసీఆర్ సారును నిలదీయడానికే మన పార్టీ అవసరం.

– ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమైంది సీఎం సారూ?

– కేసీఆర్ హయాంలో కొత్తగా ఒక్క ఫించను లేదు. కార్పొరేషన్లకు నిధులు లేవు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నారు. ఏమైంది సీఎం సారూ? ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం.

– ప్రజల సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? లేదు. అసలు రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయంలో అడుగుపెట్టని ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఘనత కూడా సీఎం సారుదే.

– ఇప్పుడు తెలంగాణాలో ఏ వర్గం సంతోషంగా ఉంది? తెలంగాణా సాధించి ఏడేళ్లయింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదన్నది అక్షర సత్యం. తెలంగాణా ఉద్యమాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను.

– తెలంగాణా సాధించుకున్నాక కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దానికి కారకులెవరు? ఇందుకేనా తెలంగానా తెచ్చుకున్నది? రైతు ఆత్మహత్యల్లో తెలంగాణా దేశంలోనే రెండో స్థానంలో ఉంది.

– నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సునీల్ నాయక్ ఆత్మహత్య నిదర్శనం. చీమకుట్టినట్లయినా లేదు పాలకులకు.

– నడిరోడ్డుపై లాచర్లను కిరాతకంగా చంపారు. ఇది మనుషులుండే సమాజమేనా? పాలకుల్లో కనీస స్పందన లేదు.

– ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణాలో, దొరగారి ఎడమ కాలి చెప్పు కింద పడి ఆత్మగౌరవం నలుగుతోంది? ఇదేనా తెలంగాణా ఆత్మగౌరవం?

– అవసరం కోసం అందరినీ వాడుకున్నారు. పాలనకు వచ్చేసరికి దొరగారి బంధుగణానిదే పెత్తనమంతా. ఇప్పుడంతా భజన బ్యాచే.

– పాలకపక్షాన్ని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. ముమ్మాటికీ అవసరం. ఇప్పుడెందుకు పార్టీ పెట్టకూడదని నేను అడుగుతున్నాను.

– కేసీఆర్ మాటలు నేను కూడా నమ్మాను. తప్పుచేస్తే ముక్కు రాస్తా అని కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణా సాధ్యమైందా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? లేక కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణా రాష్ట్రం బానిసైందా?

– దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి. లేదంటే నోరు మూసుకోవాలి అన్నట్లుంది పరిస్థితి. దొర చెప్పందే వేదం. దొర నంది అంటే నంది… పంది అంటే పంది. దొరా బాంచెన్… అని సాగిలిపడినవాడికే రాజకీయ భవిష్యత్. మరి ప్రశ్నించేవాడెవడు?

– కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడదు. బీజేపీ మతతత్వంతో వ్యవహరిస్తుంది. బీజేపీ హామీలు ఏమయ్యాయి? తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చారు.

– తెలంగాణాలో పాలకపక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. అంతర్గతంగా అన్ని పార్టీలు ఒకేతాను ముక్కలే. పాలకపక్షాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించే బలమైన గొంతు తెలంగాణాలో ఉండాలో? లేదో తెలంగాణా ప్రజలు నిర్ణయించుకోవాలి.

– ఎవరు ఔనన్నా, కాదన్నా, ఎవరికి ఇష్టమున్నా, లేకపోయినా నేను ముమ్మాటికీ తెలంగాణా బిడ్డనే. ఈ గడ్డమీదే కూతుర్ని, కొడుకును కన్నా. ఈ గడ్డమీదే బతికా. ఈ గడ్డ ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతా. నాకు అవకాశం ఇవ్వాలో, వద్దో ప్రజలే నిర్ణయిస్తారు.

– మళ్లీ చెబుతున్నా. సింహం సింగిల్ గానే వస్తుంది. మేం టీఆర్ఎస్ చెబితే రాలేదు. బీజేపీ అడిగితే రాలేదు. కాంగ్రెస్ పంపితే రాలేదు. నేను ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా.

– మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా. తెలంగాణా ప్రయోజనాల కోసమే పార్టీ పెడుతున్నా. అందుకోసమే పార్టీ పనిచేస్తుంది. చిత్తశుద్దితో పనిచేస్తామని మాట ఇస్తున్నా.

– తెలంగాణాకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటాం. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం.

– అధికార పార్టీ డబ్బుకు, మదానికి భయపడొద్దు. మీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించుకన్న ధైర్యముంది. దేవుని మీద విశ్వాసముంది. రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తెచ్చుకుందాం.

– 2021 జూలై 8వ తేదీన పార్టీని, జెండాను, ఎజెండాను ప్రకటిస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నా.

Comments are closed.

Exit mobile version