ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజాపూర్ జిల్లా జీరగూడెం-తొర్రెం ఎన్కౌంటర్, 22 మంది జవాన్ల మరణం, మావోల చేతిలో సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ బందీ, విడుదల పరిణామాల నుంచి ఆ రాష్ట్ర పోలీసులు పూర్తిగా తేరుకోకముందే నలుగురు మహిళలను మావోయిస్టు నక్సలైట్లు కిడ్నాప్ చేయడం గమనార్హం. ఆయా ఘటనలు జరిగిన బీజాపూర్ జిల్లాలోని గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే నక్సల్స్ ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారు. మితానిన్ మాస్టర్ శారద సహా నలుగురు మహిళలను నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వీరందరూ ఛత్తీస్ గఢ్ హెల్త్ వర్కర్లు కావడం గమనార్హం. గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కామకనార్ అనే గిరిజన గ్రామంలో స్థానిక ప్రజలకు కరోనా వ్యాక్సిన్లు వేస్తున్న సమయంలో నక్సలైట్లు వీరిని కిడ్నాప్ చేసినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా నివేదిస్తున్నది.

అయితే ఈ నలుగురు హెల్త్ వర్కర్లను నక్సలైట్లు ఎందుకు కిడ్నాప్ చేశారనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 3వ తేదీన జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా? వారికి చికిత్స అందించేందుకు ఈ నలుగురు హెల్త్ వర్కర్లయిన మహిళలను నక్సల్స్ కిడ్నాప్ చేసి ఉంటారా? లేక గిరిజన గ్రామాల్లో కరోనా వ్యాక్సిన్ల పేరుతో నక్సలైట్ల ఆచూకీ గురించి హెల్త్ వర్కర్లు స్థానికులను ఏవేని ప్రశ్నలు వేసి ఉంటారా? పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే అనుమానంతో మావోలు వారిని కిడ్నాప్ చేసి ఉంటారా? ఇవీ వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న భిన్న ప్రశ్నలు. కిడ్నాప్ ఘటనపై మావోయిస్టు నక్సల్స్ నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. మొత్తంగా నలుగురు హెల్త్ వర్కర్లయిన మహిళల కిడ్నాప్ ఘటన బీజాపూర్ జిల్లాలో మరో ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version