కరోనా పుట్టినిల్లు చైనాలోని వుహాన్ ప్రజలు కనీస నిబంధనలు పాటించకుండా, కరోనా భయాన్ని వీడిన చందంగా జల్సా చేసుకుంటున్న దృశ్యాలు అంతర్జాతీయ హాట్ టాపిక్ గా మారాయి. లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో వుహాన్ ప్రజలు ఎటువంటి మాస్కులు లేకుండా వాటర్ పార్కుల్లో జలక్రీడలు ఆడుతున్న సీన్లు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
ప్రధానంగా వీకెండ్ సెలవుల్లో వేలాది మంది వుహాన్ ప్రజలు వాటర్ పార్కుల్లో పోటెత్తి పండగ చేసుకున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లాక్ డౌన్ సడలించిన పరిస్థితుల్లో వుహాన్ లోని వాటర్ పార్కులు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో జనం కనీసం మాస్కులు కూడా ధరించకుండా వేల సంఖ్యలో ఎగబడి మరీ జల్సాకు దిగడం తీవ్ర చర్చకు దారి తీసింది.
చైనాలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్న పరిణామాల్లోనే వుహాన్ ప్రజల జల్సా దృశ్యాలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వుహాన్ వాటర్ పార్కుల్లో అక్కడి ప్రజల జల్సా సీన్లు మీరూ చూసేయండి.