ఆంధ్రప్రదేశ్ వాణిజ్య నగరం విజయవాడ నుంచి ఓ చిరకాల మిత్రుడు పంపిన ఫొటో ఇది. పీకలదాకా తాగి నడిరోడ్డుపై హాయిగా శయనిస్తున్న మందుబాబు దృశ్యానికి హెడ్డింగ్ కూడా ఆ మిత్రునిదే. ‘లాక్ డౌన్’ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో వైన్ షాపులను బార్లా తెరిచిన సంగతి తెలిసిందే. ఏపీలోనూ ఈరోజు మద్యం షాపులకు తాళాలు తీశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిర్ణీత వేళల్లో ఏపీలో లిక్కర్ విక్రయాలు చేస్తుంటారు. దాదాపు 45 రోజులుగా ‘చుక్క’లేక మద్యపాన ప్రియుల నాలుక పిడస కట్టుకుపోయింది కాబోలు.
ఇదిగో సోమవారం ఇలా వైన్ షాపులు తెరిచారో లేదో… ఉదయమే లైన్లో నిల్చుని యుద్ధాన్ని జయించిన వీరునిలా ఓ బాటిల్ సంపాదించుకున్న మందుబాబు దాన్ని గటగటా తాగేసినట్టున్నాడు. అందుకే ఇలా పడిపోయి ఉంటాడు. చాలా రోజుల తర్వాత మందు దొరికేసరికి బాటిల్ ఖాళీ చేస్తే సరిపోదు. అల్కాహాల్ కు కొన్ని రోజులుగా అలవాటు తప్పిన బాడీలోని నరాలు కాస్త సర్దుకోవాలి కదా? అందుకే తాగినంత వేగంగా లిక్కర్ కిక్కు ఎక్కి ఇలా రోడ్డుపై పడిపోయినట్లున్నాడు… అంటున్నారు లిక్కర్ ప్రియులు.
మరోవైపు లిక్కర్ షాపులు ఓపెన్ చేసిన రాష్ట్రాల్లో మందుబాబుల సంబరం అంబరాన్నంటుతోంది. ఏకంగా షాపుల ముందే టపాసులు కాలుస్తూ లిక్కర్ ‘పండగ’ చేసుకుంటున్నారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ కాలేజ్ రోడ్డులో ఓ వైన్ షాపు ముందు మందుబాబులు ఇటువంటి చర్యలకు పాల్పడినందుకే పోలీసులు తమ లాఠీలకు కాసేపు పని చెప్పారట. దీంతో తెరిచిన కొద్ది సేపట్లోనే వైన్ షాపు నిర్వాహకులు షట్టర్ క్లోజ్ చేశారుట.