‘దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లో కట్టేయ్’ అన్నాడట వెనకటికో మహానుభావుడు. సోషల్ మీడియాలో కొందరు పోకిరీల చేష్టలు కూడా ఆయా సామెతకు అన్వయించే విధంగా ఉన్నాయి. మొన్నా మధ్య బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా హజీపూర్ కారాగారంలో కరోనా వైరస్ గురించి జైలు సిబ్బంది ఓ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓ గేట్ వద్ద నుంచి కానిస్టేబుల్ ఒకరు తీవ్రంగా దగ్గుతూ, తుమ్ముతూ, వేగంగా నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలుతాడు. బెంబేలెత్తిన ఇతర సిబ్బంది అప్రమత్తమై అతన్ని అంబులెన్సులో ఆసుపత్రికి పంపిస్తారు. కానీ ఈ ఘటన మహారాష్ట్రలో జరిగిందని పేర్కొంటూ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు.

హజీపూర్ జైలు సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించిన వీడియో

ప్రస్తుతం తాజాగా ఇదే టైపులో గల మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని పోలీసులు కొట్టడం లేదని, తిట్టడం లేదని, ఎంచక్కా పట్టుకుని క్వారంటైన్ కు తరలిస్తున్నారని వీడియోను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇది కేరళలో జరిగిన ఘటనగా పేర్కొంటున్నారు. విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే అనేక మంది ఎగబడి మరీ ఈ వీడియోను వాట్సప్ గ్రూపుల్లోనేగాక ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.

తమిళనాడు పోలీసులు రూపొందించిన వీడియో

వాస్తవానికి ఈ వీడియోను తమిళనాడు పోలీసులు రూపొందించారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ ఉల్లంఘనల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కల్పిత పాత్రలతో పోలీసులు వీడియోను చిత్రీకరించారు. కరోనా కల్లోలంలో బైక్ లపై డబుల్, ట్రిపుల్ రైడింగ్ లో వచ్చిన యువకులను పట్టుకుని పోలీసులు అంబులెన్సులోకి ఎక్కించడం, లోపల కరోనా పేషెంటును చూసి కుర్రోళ్లు ప్రాణభీతితో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలతో వీడియో ఆద్యంతం ఆసక్తికరం. కాకపోతే కరోనాపై అవగాహన కోసం మాత్రమే తమిళనాడు పోలీసులు దీన్ని చిత్రీకరించారు. అదీ విషయం.

Comments are closed.

Exit mobile version