అది ఓ రాజ్యపు రాజు గారి దర్బార్. అక్కడ సదరు రాజుగారి అద్భుత పాలన గురించి జనంలో దరువేయడానికి కొలువుల నియామకం జరుగుతోంది. ఈ కొలువుల్లో స్థానికులకంటే పొరుగున గల మరో రాజ్యంలోని స్థానికేతరులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు నియామకాలన్నీ దాదాపుగా స్థానికేతర ప్రాతిపదికగానే జరిగినట్లు ద్యోతకమవుతున్నది. తాజాగా అవసరాన్ని బట్టి కాకుండా, అనుయాయులకు, అవినీతిపరులకు, నేరచరిత్ర గలవారికి పునరావాసం కల్పించే దిశగా ఇక్కడ ‘కొలువు’ల సృష్టితోపాటు భర్తీ కూడా జరుగుతోందనే ప్రచారమూ ఉంది. ఇందుకు బలం చేకూర్చే విధంగా ఈసారి భర్తీ చేస్తున్న కొలువుల అంశంలో రాజుగారి దర్బార్ లోని సామంతులు ఎంచుకుంటున్న ‘ప్రతిభ’ అనబడే అర్హతలే చిత్ర, విచిత్రంగా సాక్షాత్కరిస్తుండడం నిరుద్యోగులు నిశితంగా గమనించవలసిన అంశం. ప్రస్తుతం జరుగుతున్న కొలువుల భర్తీని బట్టి బోధపడుతున్నదేమిటంటే… రాజుగారి దర్బార్ లో దరువేసే కొలువు సంపాదించడానికి కొన్ని ప్రత్యేక అర్హతలు తప్పకుండా ఉండాలి. అవీ ఈ అర్హతలు:

1) కొలువును కోరుకునే నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా బహు భార్యత్వం కలిగి ఉండవలెను. గతంలో పనిచేసిన ప్రాంతాల్లోని రక్షకభట నిలయాల్లో ఇందుకు సంబంధించి నేర నమోదు చరిత్ర ఉండవలెను. మొదటి భార్యను హింసిస్తూ, అర్థరాత్రి మద్యం సేవించి, చంపేస్తానంటూ అత్తా, మామలను కత్తులతో, కటార్లతో బెదిరించవలెను. విసిగి వేసారిన అత్తా, మామ, కట్టుకున్న భార్య తాము నివసించే గుర్రాలరావుపేట రక్షక భట నిలయంలో ఫిర్యాదు చేయవలెను. సదరు రక్షక భట అధికారి ఈ నేర ఘటనలో నిందితునిగా ఆరోపణలు గల వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఉండవలెను. శరీరంపై చెడ్డీ (డ్రాయర్) తప్ప మరే ఇతర అచ్ఛాదన కూడా లేకుండా నిందితున్ని రక్షకభటులు చెఱసాలలో బంధించవలెను.

2) రాజుగారికి సంబంధించిన మరో విభాగమైన డప్పు సంస్థలో గతంలో పనిచేసిన అనుభవం ఉండవలెను. రాజుగారి ప్రధాన ఆదాయ, వనరులకు ‘కన్నం’ వేయవలెను. డప్పు సంస్థలోని ప్రధాన కోశాగారం దివాళా తీసే విధంగా ఆదాయ విభాగపు సొమ్మును భారీ ఎత్తున గుటకాయ స్వాహా చేయవలెను. విషయం బయటకు పొక్కి, నిందితునిపై రాజుగారి డప్పు విభాగపు అధికారులు విచారణ జరుపవలెను. నేరారోపణకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు విశ్వసిస్తూ నిందితున్ని రాజుగారి డప్పు కొలువు నుంచి తొలగించవలెను.

3) ఈ విధముగా అటు బహు భార్యత్వం, ఇటు గుర్రాలరావుపేట రక్షకభట చెఱశాల పాలైన అనుభవం, రాజుగారి డప్పు కొలువు నుంచి ఉద్యోగము తొలగించిన అవినీతి ‘గ్రంథం’ గల వారికి మాత్రమే రాజావారి దర్బార్ లోని దరువు విభాగంలో మరింత ఆర్థిక, ఆకర్షనీయమైన కొలువులో నియామకపు పత్రం ఇవ్వబడును. గతంలో పనిచేసిన డప్పు కొలువులోని జీతభత్యాలకు రెట్టింపు స్థాయిలో తాజాగా దరువు విభాగంలో రొక్కము చెల్లించబడును. ఎందుకంటే ఇది రాజావారి సొంత డప్పు సంస్థ సొమ్ము కాదు కాబట్టి… ప్రజలకు సంబంధించిన పన్నుల కోశాగారము నుంచి చెల్లింపులు జరుపబడును కాబట్టి.

4) ఆయా అర్హతల్లో ఏ ఒక్కటి తక్కువగా ఉన్నయెడల రాజుగారి దరువు విభాగంలో కొలువునకు అనర్హులని, దర్బార్ దరువు కొలువులో నేరచరితులు, అవినీతిపరులు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ‘కరోడా’లు మాత్రమే కలకాలం వర్థిల్లుదురని, ఇది జగమెరిగిన సత్యముగా చరిత్రలో లిఖించబడునని రాజ్యంలోని యావన్మంది స్థానిక నిరుద్యోగులకు తెలియజేయడమైనదహో….

(ముఖ్య గమనిక: ఈ సెటైర్ స్టోరీ తమ గురించే రాశారని ఉటంకించిన అర్హతలు గలవారు ఎవరైనా ‘అడ్మిట్’ అయితే ఇబ్బందేమీ లేదని కూడా తెలియజేయనైనది. -ఎడిటర్)

Comments are closed.

Exit mobile version