‘ఇంటి పోరు… ఇంతింత కాదయా…’ అంటుంటారు. తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ ఇప్పడు ఖండాంతరాలకు వ్యాపించింది. మన బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు కదా? అదేనండీ…ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు, కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ వినోద్ కుమార్. వాషింగ్టన్ లో తెలంగాణా డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) అనే సంస్థ ఉంది. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభించడానికి కొన్నేళ్ల ముందుగానే ఈ సంస్థ అక్కడ పుట్టింది. ఈ సంస్థ 20 ఏళ్ల వేడుకల కోసం వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా అమెరికా వెళ్లారు. వాషింగ్టన్ లో ఆదివారం నిర్వహించిన టీడీఎఫ్ 20 ఏళ్ల వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ, అనేక రంగాల్లో తెలంగాణా దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్నదని, అంతర్జాతీయంగా అనేక వ్యాపారాలకు తెలంగాణా అనువైన ప్రదేశమని సెలవిచ్చారు.
అయితే వినోద్ కుమార్ తెలంగాణా ప్రగతి గురించి అనర్గళంగా మాట్లాడుతున్న సమయంలోనే కార్యక్రమానికి హాజరైన అనేక మంది ప్ల కార్డులు చేబూని మరి ఆర్టీసీ సమ్మె సంగతేమిటి? అని నిలదీశారు. ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా సభకు హాజరైన అనేక మంది కూడా ఇందుకు తమ గొంతుకలను కూడా కలిపారు. ఆర్టీసీ సేవ్ అంటూ నినాదాలు మిన్నంటడంతో, వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీని, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ను తెరపైకి తీసుకువచ్చి తన ప్రసంగాన్ని కొనసాగించేయత్నం చేశారు. దేశంలో ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, కావాలంటే దిగ్విజయ్ సింగ్ చేసిన ఘన కార్యాన్ని చూడండి అంటూ హితబోధ చేేసేందుకు విఫలయత్నం చేశారు. కానీ సభికులెవరూ శాంతించినట్లు కనిపించలేదు. సేవ్ ఆర్టీసీ అంటూ అమెరికాలోనూ నినదిస్తూనే ఉన్నారు. కావాలంటే ఈ వీడియో కూడా చూడండి.