ప్రముఖ నటి జయంతి (76) ఇక లేరు. శ్వాస సంబంధిత సమస్యతో ఆమె ఆదివారం రాత్రి కన్ను మూశారు. ముప్పయి ఏళ్లుగా అస్తమా వ్యాధితో బాధపడతున్న జయంతి ఆరోగ్యం క్షీణించడంతో అమెను బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు.
బళ్లారిలో 1945 జనవరి 6న జన్మించిన జయంతి కన్నడ సినిమా ‘జెనుగూడు’ (1963)తో చిత్రసీమకు పరిచమయ్యారు. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం వంటి పలు దక్షిణాది సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను జయంతి పోషించారు. దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన జయంతి 300 సినిమాల్లో హీరోయిన్ పాత్రను పోషించారు.
తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నరసింహారెడ్డి తదితర చిత్రాల్లో నటించారు. జయంతి మృతిపై తెలుగు చిత్రసీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.