1980వ దశాబ్ధం… వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం. అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ ఆవరణ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్ తిరిగి వెళ్లిపోతున్నారు. ‘శ్రీమతి గవర్నర్ గారూ…?’ అంటూ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒకాయన ( సంఘటన గుర్తున్నంత వరకు హిందూ రిపోర్టర్ శాస్త్రిగారు లేదంటే ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి వీఎల్ నరసింహారావు గారు అనుకుంటా) పిలిచారు. ‘వ్హాట్..?’ అంటూ గవర్నర్ కుముద్ బెన్ ఆరా తీశారు. ‘మీరు ఈ మొక్కలు నాటారు… వెళ్లిపోతున్నారు. రేపటి నుంచి వీటికి నీళ్లు ఎవరు పోయాలి?’ అని రిపోర్టర్ ప్రశ్నించారు. ‘అదేమిటి? మొక్కలకు నీళ్లు ఎవరు పోయడమేంటి? యూనివర్సిటీ సిబ్బంది వాటిని సంరక్షిస్తారు కదా?’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ విద్యార్థులు తాగడానికే నీళ్లు లేవు. మొక్కలకు ఎక్కడి నుంచి తీసుకువచ్చి నీళ్లు పోస్తారు?’ అని రిపోర్టర్ కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆశ్చర్యపోయిన గవర్నర్ తన విచక్షణాధికారాలతో అప్పటికప్పుడు రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని మంజూరు చేశారు. ప్రశ్నకు సమాధానంగా సమస్యకు పరిష్కారం లభించింది. విద్యార్థుల తాగునీటి సమస్య తీరింది. ఎప్పుడో జరిగిన ఈ ఘటన ప్రస్తావన ఇప్పుడెందుకంటే…?
ప్రస్తుతం ప్రశ్నలంటేనే నాయకులకు చిర్రెత్తుకొస్తోంది. జవాబు చెప్పలేక రుస రుసలాడుతున్నారు. ఫలాయవాదతో చిత్తగిస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా ఏమీ లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా… ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా… ఎక్కడైనా, ఎప్పుడైనా… అనేక మంది నాయకులది ఇదే తంతు. ప్రశ్నంటేనే అసహనం. విపక్షంలో ఉన్నపుడు మాత్రం ‘మీడియా మిత్రులకు నమస్కారం… మీరు లేకుంటే మా వాయిస్ ప్రజలకు చేరేది కాదు. మా గొంతుక మీరే. మీడియా లేకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’ అని ప్రవచించిన పలువురు రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయిస్తున్నారు. ‘అదేం ప్రశ్నవయా..? దిక్కుమాలిన ప్రశ్నలు. అవసరమా నీకు? అయినా నువ్వే పేపర్? నీది ఏ టీవీ? చిల్లర మల్లర ప్రశ్నలేస్తరానయా? నువ్వేదో అడిగితే నేను సమాధానం చెప్పాల్నా? నా స్థాయి ఏమిటీ? నువ్వడిగే ప్రశ్న ఏంది? ఇదీ వరుస.
ఈ తరహా ప్రవర్తన గల నాయకుల చెంతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడో చేరారు… తెలుసు కదా? మీడియా ప్రతినిధులపై అసహనంతో విరుచుకుపడడం ఆయనకు కొత్తేమీ కాదు. కాకపోతే తాజా ఘటనలోనూ ట్రంప్ తన టెంపరితనాన్ని మరోసారి ప్రదర్శించడమే విశేషం. తాజాగా నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులపై రుస రుసలాడారట. వాళ్లు చేసిన తప్పేమిటంటే ప్రశ్నించడమే. ‘కరోనా పరీక్షల అంశంలో అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉన్నట్లు అమెరికా అదే పనిగా ఎందుకు చెబుతోంది? పరీక్షల్లో మెరుగ్గా ఉండడం కూడా గొప్పేనా? ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడడం దేనికి? నిత్యం అనేక మంది అమెరికన్లు అసువులు కోల్పోతున్నారు. రోజు రోజుకూ కేసులు బాగా పెరిగిపోతున్నాయ్? మరి వీటి సంగతేంటి?’ అని సీబీసీ న్యూస్ ప్రతినిధి వీజియా జియాంగ్ ప్రశ్నించారు.
అంతే ట్రంపునకు ఎక్కడా లేని కోపం వచ్చింది. ‘ఈ ప్రశ్న చైనాను అడగాలని, తనను కాదని, ప్రపంచంలో దాదాపు అన్నిచోట్లా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని కొందరు మన నేతల తరహాలోనే ట్రంప్ ఎదురుదాడి చేశారు. కానీ ట్రంప్ ఎదురుదాడి వైఖరికి వీజియా ఏమీ బెదరలేదు. తనకే ఈ విషయం ఎందుకు చెబుతున్నారని నిలదీసింది. (వీజియా చైనీస్ అమెరికన్ అనే విషయం గమనార్హం) తాను ఎవరినీ ఉద్దేశించి చెప్పడం లేదని, చెత్త ప్రశ్నలు వేసేవారికే వర్తిస్తుందని ట్రంప్ వెటకరించారట. అయినప్పటికీ వీజియా వదల్లేదు. ఇదేమీ చెత్త ప్రశ్న కాదని శ్వేత సౌధాధిపతిని మళ్లీ నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక ట్రంప్ ‘ఇంకా ఏవైనా ప్రశ్నలున్నాయా?’ అని మిగతా మీడియా ప్రతినిధుల వైపు మొహం తిప్పారట. ‘నేను రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను’ అని సీఎన్ఎన్ రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్ ఉద్యుక్తమై ముందుకు రాగా, ట్రంప్ అక్కడి నుంచి నిష్క్రమించారుట. ఇదీ అమెరికాలో జరిగిన తాజా ఘటనపై వెలువడిన వార్తా కథనాల సారాంశం.
మొత్తంగా చెప్పొచ్చేదేమింటే… ట్రంప్ లాంటి నాయకుల అసహనానికి తాము బెదిరేది లేదని మహిళా జర్నలిస్టులు నిరూపించడమే అసలు విశేషం. అదిరింపులు, బెదిరింపులతో, అసహనపు హుంకరింపుతో అధికారంలో ఉన్నంతకాలమే ట్రంపు లాంటి లీడర్లు కొంతకాలం నెట్టుకురాగలరు. అధికారం కోల్పోయి ‘మాజీ’లయ్యాక… తమ వాయిస్ ప్రజలకు వినిపించాలని ఇదే జర్నలిస్టుల ముందు మళ్లీ మోకరిల్లాల్సి ఉంటుంది. అప్పుడు ఇదే జర్నలిస్టులు వీళ్లను పట్టించుకోకపోవచ్చు. విలేకరులపై ఇలా బెదిరింపులకు పాల్పడి ‘మాజీ’లైన అనేక మంది రాజకీయ నాయకుల చరిత్ర చెబుతున్న సత్యమిదే.