భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి అమెరికాలో భారీ షాక్ తగిలింది. దేశీయ ఫార్మా దిగ్గజంగా ప్రాచుర్యం పొందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) తిరస్కరించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి భారత్ బయోటెక్, అమెరికా భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్ తో కలిసి చేసిన ప్రతిపాదనలను బైడెన్ ప్రభుత్వం నిరాకరించింది.

ఇండియా వ్యాక్సినేషన్ లో కోవాగ్జిన్ ను చేర్చిన సుమారు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదనే విమర్శల నేపథ్యంలో ఆయా సంస్థకు అమెరికాలో ఎదురుడెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ నిన్న తెలిపింది.

అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్‌డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. కోవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్‌ను అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించినట్లు కూడా ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. తమ టీకా కోవాగ్జిన్‌ను యూఎస్‌కు అందించేందు తాము కట్టుబడి ఉన్నామని, అదేవిధంగా కోవాక్సిన్ కోసం మార్కెటింగ్ అప్లికేషన్‌ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్‌ డేటా అవసరమని కంపెనీ భావిస్తోంది. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్న క్రమంలో తమ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరపున అక్కడి ప్రముఖ ఫార్మా కంపెన ఆక్యుజెన్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది.

అయితే మరింత అదనపు సమాచారాన్ని కోరుతూ యూఎస్ఎఫ్‌డీఏ ఇందుకు తిరస్కరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. మూడో దశ పరీక్షల డేటాను పరిశీలించిన మీదటే డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు లభించే అవకాశముందని, ప్రస్తుతం అనేక దేశాలు భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను గుర్తించలేదనే వార్తలు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు లేని వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కొన్ని దేశాలలో “అన్‌ వాక్సినేటెడ్” గానే పరిగణిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version