సామ్రాజ్యవాద దేశమైన అమెరికాలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మరికొన్ని పార్టీలు పోటీ పడినప్పటికీ ప్రధాన పోటీ రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల మధ్యనే. ఇపుడే కాదు దశాబ్దాల కాలం నుంచి ఆ పార్టీలే, ఒక పార్టీ కాకపోతే మరో పార్టీ అధికారం లోకి రావడం జరుగుతున్నది. ఈ పార్టీలు అమెరికా సాధారణ ప్రజలకు మేలు చేయడం అనేది ఏమీ లేదు. గుత్త సంస్థల ప్రయోజనాల కోసం పని చేస్తాయి. సామ్రాజ్య వ్యవస్థ ఆరంభమైనప్పటి నుంచి అమెరికా చరిత్ర వెనుక బడిన దేశాలను, పీడిత జాతులను దోపిడీ చేసిన, అణచివేసిన చరిత్రే. తన మార్కెట్ ప్రయోజనాల కోసం ప్రపంచాధిపత్యం కోసం అది చేయని ఘోరాలు లేవు. అందుకోసమే ప్రపంచ నెంబర్ 1, గూండా నెంబర్ వన్, టెర్రరిస్ట్ అని ప్రఖ్యాతి గాంచింది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా అమెరికా ప్రజలకు గానీ, ప్రపంచ ప్రజలకుగానీ ఒరిగే మేలు ఏమి లేకపోగా, ఏ ప్రభుత్వమైనా సామ్రాజ్యవాద దోపిడీని, గుండాగిరిని అమలు చేస్తుంది. ఈ విషయంలో కమ్యూనిస్టుల మధ్య పేచీ ఏమి లేదు. ఈ విషయాలను కమ్యూనిస్టులు బహిర్గత పరచడానికి ముందు భాగాన ఉంటారు.
ఒక ఎన్నిక నుండి మరో ఎన్నిక కాలంలో అధికార పార్టీ ప్రజల అసంతృప్తికి గురి కావడం, బలమైన ప్రజా ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో ఆలాంటి మరో పార్టీకి పట్టం కట్టడం జరుగుతున్నది.
అమెరికా నేటి నిర్దిష్ట ఎన్నికలకు వస్తే, ట్రంప్ అనుసరించిన విధానాలు, పద్దతులు, పిచ్చి చేష్టలు అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నల్ల జాతీయులతో ట్రంప్ వ్యవహరించిన తీరు, అమెరికా ప్రజల ఆగ్రహం అందరం చూసిందే. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలోని ప్రజాస్వామ్య డొల్లతనం, స్వేచ్ఛ, జాతి వివక్ష బట్టబయలైంది. కరోనా మహమ్మారి విషయంలో ట్రంప్ అనుసరించిన విధానం, ప్రకటనలు పిచ్చోని చేతిలో రాయి చందంగా నవ్వుల పాలై తీవ్ర నిరసనకు గురయ్యాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గమనిస్తే, అనేక విషయాల్లో వివిధ దేశాలపై, మన దేశం సహా టెర్రరిస్ట్ గుండా బెదిరింపులనూ ప్రపంచం నిరసించింది. ఆయా పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ ఓటమిని కోరుకునే స్పందనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంపై ప్రజాస్వామిక వాదుల కుషీగా మాత్రమే నా కామెంట్ తప్ప, కమ్యునిస్టుగా దాన్ని నేను గొప్పగా చెప్పేదేమీ లేదు.
మొత్తంగా చూసినపుడు బూర్జువా ప్రభుత్వమైనా ప్రజల సమస్యలను పరిష్కరించడం జరగదనే జనరల్ అవగాహన ఒక్కటే కాకుండా వివిధ సందర్భాలలో వాటిపై తనదైన వ్యాఖ్యానం కమ్యునిస్టు పార్టీ చేయవలసి ఉంటుంది.
✍️ జంపన్న