మావోయిస్టు నక్సల్స్ కోసం తాము కూంబింగ్ నిర్వహిస్తుండగా కమాండర్ సహా ఇద్దరు ఎల్జీఎస్ నక్సలైట్లు చిక్కినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. తమను చూసి పారిపోతుండగా మణుగూరు ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్జీఎస్) కమాండర్ మడివి మంగాలు అలియాస్ జిలాలు (35), సభ్యురాలు మడకం దేసి అలియాస్ మమతక్క (20)లను పట్టుకున్నట్లు చెప్పారు. తిర్లాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఆయా ఇద్దరు నక్సలైట్లు అనుమానాస్పదంగా పారిపోతూ పట్టుపడినట్లు చెప్పారు.
ఎల్జీఎస్ కమాండర్ మంగాలు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా నింద్ర, సభ్యురాలు సుక్మా జిల్లా డోకుపాడు గ్రామాలకు చెందినవారని చెప్పారు. వీరివద్ద నుంచి బార్మర్ తుపాకీ, జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు తదిరత సామాగ్రితోపాటు విప్లవ సాహిత్యాన్ని స్వాధీన చేసుకున్నట్లు చెప్పారు. ఎల్జీఎస్ కమాండర్ మడివిపై 16 హత్యోదంతాలు, మందుపాతరల పేల్చివేత, కిడ్నాప్ ఘటనలు సహా 60 కేసులు, అదేవిధంగా సభ్యురాలు మమతక్కపై 17 కేసుల చొప్పున సుక్మా, బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో నమోదై ఉన్నట్లు ఎస్పీ సునీల్ దత్ వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు పూర్తిగా అమాయకులైన ఛత్తీస్ గఢ్ రాష్ట్ర గిరిజనులను తెలంగాణ ప్రాంతానికి తరలించి, ఇక్కడ వారితో పార్టీకి రకరకాలైన పనులను చేయించుకుంటూ వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అమాయక గిరిజనులను వారి స్వప్రయోజనాల కొరకు వాడుకోవడం జరుగుతున్నదని, మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులయిన చంద్రన్న, హరి భూషణ్, ఆజాద్, దామోదర్ లు అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను లెటర్లతో బెదిరించే విషయాలు తమకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయన్నారు.
మావోయిస్టు నాయకులు గతించిన సిద్దాంతాలతో వారి పార్టీ ఉనికిని చాటుకోవడానికి అమాయక గిరిజన ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో అన్యాయంగా చంపుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. తుప్పుపట్టిన సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని నక్సల్స్ ను కోరుతున్నట్లు ఎస్పీ చెప్పారు. మావోయిస్టు పార్టీ రోజు రోజుకూ క్షీణిస్తూ, తమ ఉనికిని కోల్పోతోందన్నారు. ఈ ప్రాంతంలో దళాల కదలికలు ప్రజల ద్వారా తమకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయని, కావున మావోయిస్టు నాయకులైన చంద్రన్న, హరిభూషన్, ఆజాద్, దామోదర్, లచ్చన్న, భద్రులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు.
ఫొటో: అరెస్ట్ చేసిన ఎల్జీఎస్ నక్సల్స్ గురించి వివరిస్తున్న ఎస్పీ సునీల్ దత్