పుట్ట మధు… రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా పరిచయం అక్కరలేని అధికార పార్టీ నాయకుడు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత చైర్మెన్. హైకోర్ట్ అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్యోదంతం అనంతరం వివాదాస్పద వార్తల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేత. తన పదిరోజుల అదృశ్యం, అడ్వకేట్ దంపతుల హత్యోదంతం, ఏపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న తదితర పరిణామాలపై తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుట్ట మధు చెప్పిన అంశాలు ఆసక్తికరంగానే కాదు.., మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. అధికార పార్టీ మద్ధతుదారునిగా ప్రాచుర్యంలో గల వ్యక్తికి చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ ను సైతం పుట్ట మధు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంతకీ తన అకస్మాత్తు అదృశ్యంపై పుట్ట మధు ఏమంటున్నారంటే…
‘పదిరోజులపాటు మెడిటేషన్ లో నేనున్నా… ఏం జరిగిందో టీవీలు చెప్పాలె. ఏం జరుగుతదో టీవీలు చెప్పాలె. అది కూడా నేను అన్ని టీవీలను అనలేను. ఆ టీవీ ప్రజల్లో చులకనైంది. బోర్లా బొక్కల, వెల్లకిలా పడడం జరిగింది. రెండు ఛానల్స్ కక్ష గట్టి, వాళ్ల కుటుంబ సభ్యులను చంపినట్లు భావించి, చూపించినట్లు కనిపించింది. నాకు నవ్వొస్తున్నది. అసలు ఈ టీవీలను ప్రజలు ఎందుకు చూస్తున్నరో ఆలోచించుకోవాలి. అది టీఆర్ఎస్ ఛానలా? బీజేపీ ఛానలా? వాళ్లే చెప్పాలి.’ అని పుట్ట మధు వ్యాఖ్యానించారు.
తాను 2003 నుంచి రామచంద్ర మిషన్ అభ్యాసినని, ఇప్పటికీ తనకు హెల్త్ ప్రాబ్లమ్ కూడా కొంచెం ఉందన్నారు. ‘కనబడనంత మాత్రాన దొంగతనం జరిగిందని, కుంభకోణం జరిగిందనే చర్చకు ఎక్కడైనా జవాబుందా? కనబడకపోతే ఏదో జరిగినట్లేనా? ఏదైతే చూపించి, ఏదైతే బయటకొస్తదని అనుకున్నరో… భంగపడ్డవాళ్లు తమ ప్రేక్షకులకు జవాబు చెప్పాలె. నా ఫ్యామిలీ, మిత్రుల అందరి అకౌంట్ నెంబర్లు పోలీసులకు ఇచ్చినం. అకౌంట్ నెంబర్లు చూసి పోలీసులే ఏడ్చేకాడికి వచ్చింది. రెండు కోట్లు కాదు రెండు లక్షలు కూడా కనిపిస్తలేవని… నాయకుల దగ్డర డబ్బులెందుకు ఉంటయి? ఎవరో అయిదు రూపాయలు సాయం జేస్తే, నాలుగు రూపాయలు దానం జేస్తనే ఉంటం.’ అని మధు అన్నారు.
‘నాకు కోపం ఉంటే ఎవరి మీద ఉండాలె? నామీద పిటిషన్ ఏసినోడి మీద ఉండాలె. ఆ పిటిషన్ ఏసినోడి వకీల్ మీద ఎందుకుంటది?’ అని ప్రశ్నించారు. అడ్వకేట్ వామన్ రావు దంపతులు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. వాళ్లకు, తనకు సంబంధం లేదని, వాళ్లను తాను చూడనే లేదని, వాళ్లు అడ్వకేట్ అని, ఎవరు ఫీజు ఇస్తే వాళ్ల పక్షాన ఉంటారని మధు వ్యాఖ్యానించారు. తనపై పోలీసులు కేసులు పెట్టలేదని, తనను వేటాడలేదని, వేటాడారనేది టీవీల కల్పితంగా మధు అభివర్ణించారు. తనను ఆంధ్రా ప్రాంతంలో అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువచ్చారనేది కూడా తప్పుగా పుట్ట మధు పేర్కొన్నారు. పుట్ట మధు ఇంకా ఏమన్నారో వివరంగా దిగువన గల యూ ట్యూబ్ లింకు ద్వారా వీక్షించవచ్చు.