‘సాక్షి’ మీడియా గ్రూపులో తీవ్ర కలకలం. ఉద్యోగ వర్గాల్లో ఒకటే ఆందోళన. పొమ్మనలేక పొగ బెడుతున్నారనే అనుమానాలు. చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీకి గురవుతున్నారనే ప్రచారం. జిల్లా పేజీలకు శుక్రవారం నుంచి మంగళం పాడిన సాక్షి దినపత్రికలో తాజాగా జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన బదిలీ అంశాలు సంస్థ ఉద్యోగ వర్గాల్లో భయాందోళనకు కారణమయ్యాయి.
జరుగుతున్న ప్రచారం ప్రకారం…. తెలంగాణాలో ఏడెనిమిది మంది వరకు రిపోర్టర్లను, సబ్ ఎడిటర్లను తాజాగా బదిలీ చేశారు. భూపాలపల్లి స్టాఫర్ ను తిరుపతికి, పెద్దపల్లి స్టాఫర్ ను నెల్లూరుకు, ఖమ్మం బ్యూరో ఇంచార్జిని అనంతపురం డెస్కుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఖమ్మంలో యూనిట్ లో గల ఓ సబ్ ఎడిటర్ ను శ్రీకాకుళం, ఇంకో ప్రాంతంలోని సబ్ ఎఢిటర్ ను రాజమండ్రికి, మరో రిపోర్టర్ ను ఢిల్లీకి బదిలీ చేసినట్లు సమాచారం.
ఓ సంస్థలో ఉద్యోగుల బదిలీ పరిపాలనాపరంగా అంతర్గత వ్యవహారమే కావచ్చు. కానీ కనీసధర్మం లేని బదిలీలు జరుగుతున్నాయనేది ఆయా సంస్థలోని ఉద్యోగవర్గాల ఆందోళన. తెలంగాణా జిల్లాల్లో పనిచేస్తున్నవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడంపై ఉద్యోగవర్గాలు సహజమైన అనుమానాలనే వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక భారం పేరుతో ఉద్యోగుల సంఖ్యను కుదించే ప్రక్రియగా ఆ వర్గాలు సంశయిస్తున్నాయి. మొత్తంగా తాజా బదిలీల వ్యవహారం సాక్షి ఉద్యోగ వర్గాల్లో అభద్రతకు హేతువయ్యాయి.
UPDATE:
కాగా ఈ వార్తా కథనం ప్రచురించిన 20 నిమిషాల వ్యవధిలోనే సాక్షి పత్రిక ముఖ్య బాధ్యుడొకరు స్పందించారు. ఈమేరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. కథనంలోని ‘చెట్టుకొకరు… పుట్టకొకరు’ అనే పదాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సంస్థాగతంగా, పరిపాలనాపరంగా, మరెన్నో ఇతరత్రా అంశాలు ప్రామాణికంగా బదిలీలు అనివార్యమయ్యాయనే భావనను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.