ఈసారి వర్షాలు ఎప్పుడు కురుస్తాయి? సీజన్ ప్రకారమే వర్షాలు కురుస్తాయా? ఇంతకీ నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయా? లేదా? మరో వారం రోజులు ఆలస్యంగా ప్రవేశిస్తాయా? అంటే వర్షాలు కూడా ఆలస్యమేనన్నమాట. ఏతావాతాగా వాతావారణ శాఖ ఏం చెబుతోంది? అని ఆరా తీయడమే కాదు, జూన్ నెల వస్తోందంటే మనం వర్షం రాకకోసం ఎదురు చూస్తుంటాం కదా? ముఖ్యంగా రైతులైతే మబ్బుల వైపు తీక్షణంగా చూస్తుంటారు. సరే… వాన రాకడ గురించి వాతావరణ శాఖ అంచనా తప్పుతుందా? కుదురుతుందా? అనే తర్కాన్ని కాసేపు వదిలేస్తే…
మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కుమ్మరి వృత్తిదారులు ఇప్పటికీ తమ ‘సంప్రదాయ’ పద్ధతుల్లోనే వర్షం గురించి అంచనా వేస్తుండడమే అసలు విశేషం. ఉత్తరాది వారే కాదు దక్షిణాదివారైనా, మరెక్కడి కుండల వృత్తిదారులైనా ఈసారి వర్షాల పరిస్థితి ఏమిటి? అనే అంశంపై వానాకాలపు సీజన్ కు ముందే ఆరా తీస్తుంటారు. వానాకాలం, శీతాకాలాల్లో కుండల తయారీ కొనసాగితేనే వేసవిలో ఈ వృత్తిదారులకు నాలుగు రూకలు గిట్టుబాటయ్యేది. వర్షాలు బీభత్సంగా కురిసే వాతావరణం ఉంటే కుండల తయారీని నిలిపివేసి వేరే పనులవైపు దృష్టి సారిస్తారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కుమ్మరి వృత్తిదారులు వాన రాకడ గురించి ఎలా అంచనా వేస్తున్నారో ఇక్కడ చూడవచ్చు. ఏటా ఇది వాళ్ల సంప్రదాయం కూడానట. వాతవారణ శాఖ చెప్పే సమాచారంపై వీళ్లు పెద్దగా ఆధారపడరు. ఈ ‘కుండ’ వాతావరణంపైనే వీరికి విశ్వాసం ఎక్కువ. భూమిని శుభ్రంగా అలికి, నలు దిక్కులా సమాన దూరంలో నాలుగు పిడతలు (ముంతలు) పెట్టి, అందులో నీళ్లు పోసి, మధ్యలో మంట పెట్టి వాతావరణాన్ని అంచనా వేస్తున్న తీరు ఆసక్తికరం. కుండలు పగిలిన తీరు వాతావరణ సూచికగా భావిస్తారట. ఒక్క కుండ మాత్రమే పగిలితే వర్షాలు కురిసే అవకాశం అత్యల్పమట. ఏ దిక్కున కుండ ముందు పగిలితే ఆ దిశలో వర్షపాతం అధికమట. మొత్తంగా కుండలు పగిలే తీరే వర్షాలకు గీటురాయిగా భావిస్తారట.
నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే తాజాగా పాటించిన సంప్రదాయపు ‘కుండ’ వాతావరణపు దృశ్యమిది. ఇక దిగువన వీడియో చూడండి.