Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»జర్నలిస్టుల ప్రశ్నలు.. పాలకుల పరిహాసాలు..

    జర్నలిస్టుల ప్రశ్నలు.. పాలకుల పరిహాసాలు..

    May 22, 20204 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 KCR 2

    ✍️ (శంకర్‌ శెంకేసి)

    అదేమిటో జర్నలిస్టులనెప్పుడూ సగటు సమాజం ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది. తమ తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్లని, తాము అడగాల్సిన ప్రశ్నలను తొట్రుపాటు లేని స్వరంతో అడిగే మొనగాళ్లని, పాలనలో భాగస్వామ్యమయ్యే ప్రజాప్రతినిధులు, అధికారగణం ప్రజాహితాన్ని మరిచినప్పుడు చెర్నాకోలాతో చప్పున చరిచే శక్తిమంతులని భావిస్తుంది. వాళ్లు అలాగే వ్యవహరించాలని, వాళ్లతో నిమిత్తం లేకుండానే కోరుకుంటుంది. ఇజాలకు, భావజాలాలకు, పాలసీలకు, ప్యాకేజీలకు బద్దులుకాకుండా, ప్రజాపక్షమే సంకల్పంగా గొప్ప ఆత్మబలంతో నిలదీసే ‘సామాన్యుడి’లా కనిపించాలని తాపత్రయపడుతుంది. జర్నలిస్టులు తమ హృదయాల్లోకి పరకాయ ప్రవేశం చేసి వారి జీవితాలను స్పశించాలని, వారి గొంతుకగా ప్రతిధ్వనించాలని ఆశపడుతుంది.

    ఆస్తులు అమ్ముకున్నారు.. అప్పు చేసి బతికించుకున్నారు:
    నిజమే… పత్రికలు ఒకప్పుడు సామాజిక ప్రయోజనం, జాతీయోద్యమ ఉద్దీపనం అనే లక్ష్యాలతో పురుడు పోసుకుని మనుగడ సాగించేవి. వాటి అంతిమ లక్ష్యం ప్రజలే. చీకట్లు తొలగి జనజీవితాల్లో వెలుగులు విరబూయాలని, సమాజం సకల రంగాల్లో ఆరోగ్యంగా పరుగులు పెట్టాలని తపించేవి. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా అవి ప్రతిపక్షం పాత్ర పోషించేవి. తమ సంస్థాగత ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాలే ఎజెండాగా భావించేవి. అందుకే వాటిని నడిపించిన వారు ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఆస్తులను తెగనమ్మి, అప్పులు చేసి వాటిని బతికించుకున్నారు. తాము బతికినన్నాళ్లు వాటికి ఊపిరిపోశారు.

    ఇదంతా గతించిన చరిత్ర. అలా అని ఇప్పుడున్న పత్రికలను నిందించి లాభం లేదు. వాటి పాతివ్రత్యాన్ని పనికిరాని కొలమానాలతో కొలువకూడదు. కాలమెప్పుడూ ఘనీభవించి ఉండదు. అది ప్రవాహం వలె ముందుకుసాగుతూనే ఉంటుంది. కాలంతో పాటే విలువలు, వాటి నిర్వచనాలు, వ్యాఖ్యానాలు మారుతూ ఉంటాయి. పత్రికలను ఒకప్పుడు వ్యక్తులు నడిపేవారు. ఇప్పుడు సంస్థలు నడుపుతున్నాయి. పత్రికలు ఒకప్పుడు సామాజీకరణ కాగా, ఇప్పుడు కార్పొరేటీకరణ అయ్యాయి. పత్రికను ఒకప్పుడు జ్ఞానాన్ని పంచే సాధనంగా చూస్తే, ఇప్పుడు ఫక్తు మార్కెట్‌ సరుకుగా చూస్తున్నారు. మొత్తంగా పత్రికారంగం ఇప్పుడు పత్రికాపరిశ్రమగా మారింది. ‘పెట్టుబడి–లాభం’ అనే ఆర్థికశాస్త్ర ఛట్రంలో పక్కా వ్యాపారంగా ఇమిడిపోయింది.

    ఇప్పుడు ‘పత్రికలు-వినియోగదారులు’ మాత్రమే:
    ప్రోడక్టు ఏదైనా సరే ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు సాగే ప్రక్రియలో దాని అంతిమ లక్ష్యం లాభసముపార్జన మాత్రమే. ఆ రంగంలో పోటీ పెరిగిప్పుడు లాభ సముపార్జన కోసం కొత్త ‘దారులు’ వెతుక్కోవాల్సి ఉంటుంది. కొత్త శక్తులను ప్రయోగించాల్సి ఉంటుంది. అనేకానేక బంధాలను కలుపుకోవాల్సి ఉంటుంది. ‘పత్రికలు–పాఠకులు’ అనే పదబంధం ఇప్పుడు ‘పత్రికలు–వినియోగదారులు’గా మారిపోయింది. పత్రిక ఎలా ఉండాలి అనే అంశం.. పూర్తిగా దానిని నడిపే యాజమాన్యం ఇష్టం. పత్రికలను నడపడం అంటే ‘నోట్లు వెదజల్లి చిల్లర ఏరుకోవడం’లా ఉంటుందని ఒక నానుడి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవమనే చర్చ ఇప్పుడు అప్రస్తుతం. అయితే పత్రికల నిర్వహణ అంత ఈజీ కాదు. కేవలం కాపీల అమ్మకం ద్వారా అవి మనుగడ సాగించలేవు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి వచ్చే యాడ్స్‌తోనే అవి బతుకుతాయి. అలాగే పత్రిక ‘ఆధారంగా’ జరిపే మీడియేతర వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం సంస్థ ‘అభివృద్ధి’కి కీలకంగా ఉంటుంది. పత్రికల వెనుక అనేక ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు దాగిఉంటాయి. వాటిని ఏ యాజమాన్యమూ వదులుకోదు. వదులుకోవాలని ఏ ఆర్థికశాస్త్రమూ బోధించదు.

    ts29 zwptkh6vr86rpwk6
    నువ్వేమిటీ? నీ తీరేమిటి? అని పాలకులకు ఎదురొడ్డి ప్రశ్నించే ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాథ్ గోయెంకా వంటి పత్రికాధిపతులు ఇప్పుడు ఎవరున్నారు ?

    పార్టీలకు, పాలకులకు పత్రికల ఊడిగం:
    ‘ప్రభుత్వం ఇచ్చే యాడ్స్‌ పొందుతూ, రాయితీలు, వనరులు, సౌకర్యాలు అనుభవిస్తూ పత్రికల్లో మాత్రం నిష్పాక్షికతను మర్చిపోవడం సరైనది కాదు..’ అనే వాదన ఒకటి తరుచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వాదన కూడా పూర్తిగా చెల్లుబాటు కాదు. మన దేశంలో ఉన్న అనేక పత్రికలు రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుబంధంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఎన్నికల వేళ, అధికారంలో ఉన్నా లేకున్నా అవి తమ ‘పార్టీల’ పాటే పాడుతుంటాయి. తాము నమ్ముకున్న పార్టీలు, తమను నమ్ముకున్న పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటాయి. పత్రికలు పార్టీల పుత్రికలుగా మారిపోయిన తర్వాత.. అధికారంలో ఉన్న పాలకులు తమ పత్రికలకు యాడ్స్‌ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు.. పరోక్షంగా ప్రయోజనాలు కల్పించేందుకు ఉత్సాహపడతారు. ఇది ఎవరి హయాంలోనైనా సర్వ సాధారణం. క్విడ్‌ ప్రోకోలు అందరూ చూసిందే కదా.

    ఇట్లా బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో అంశాలు పత్రికారంగంలో పార్ట్‌ అండ్‌ పార్సిల్‌గా ఉంటాయి. చిన్నాపెద్దా అన్ని రకాల పత్రికలు పార్టీల వారీగా, భావజాలాల వారీగా చీలిపోయిన తర్వాత.. ఆ పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా వాటికి ప్రతినిధులుగానే కనిపిస్తారు. వారు వేసే ప్రశ్నలకు సాంక్టిటీ ఉండదని , కావాలని బదనాం చేస్తారని, ప్రీ ఆక్యుపైడ్‌ ఎజెండా ఉంటుందని పాలకులు భావిస్తారు. అందుకే తమ వారనుకున్న వారు ప్రశ్నిస్తే తీసిపారేస్తారు.. తమ వారు కారనుకున్న వారు ప్రశ్నిస్తే హూంకరిస్తారు.

    జర్నలిస్టులు కాదు… ఉద్యోగులు మాత్రమే!
    పత్రిక ప్రోడక్ట్‌గా మారిన నేపథ్యంలో ఆ ప్రోడక్ట్‌ తయారీ ప్రాసెస్‌లో పని చేసేవారందరూ ప్రాథమికంగా ఉద్యోగులే అవుతారు. అందువల్ల జర్నలిస్టులు తాము ప్రాతినిథ్యం వహించే పత్రిక ‘యొక్క’ సంస్థలో ఉద్యోగులు మాత్రమే అనడంలో ఎలాంటి సంశయమూ అక్కర్లేదు. ఉద్యోగులెపుడూ యాజమాన్యాలు చెప్పిన పనిని మాత్రమే చేస్తారు. యాజమాన్యాల పాలసీలను, భావజాలాలను, సంబంధాలను, ప్రయోజన బంధాలను తమ ‘జ్ఞానం’తో గుర్తెరిగి మసులుకుంటారు. అందుకే జర్నలిస్టులు అనబడే ఉద్యోగులు ఇప్పుడు ముఖ్యమంత్రుల ప్రెస్‌మీట్లలో బుద్ధిగా కూర్చొని, చెప్పింది విని రాసుకొని వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వలె ‘సర్వీసు’ రూల్స్‌ పాటిస్తున్నారు. పాత్రికేయంలోని మజాను జారవిడుచుకుంటున్నారు.

    సీనియర్ల ‘గొడుగు’ పబ్బం:
    పాత్రికేయ వృత్తికి రాజకీయ విశ్వాసాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఉండాల్సిన సన్నని విభజన రేఖ చెరిగిపోయి చాలాకాలం అయింది. సకల రంగాల వలెనే మీడియాలోనూ పైరవీలు, అడ్డదారి సంపాదనకు, అక్రమాలకు తెగబడే వ్యక్తులు పెరిగిపోయారు. ‘సీనియర్లు’ అనబడే వారు ‘ఏ ఎండకు ఆ గొడుగు’ పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. నిష్పాక్షికత, నిస్వార్థం అనే విలువలను కోల్పోవడమే ఇప్పుడు ‘విలువ’గా మారింది. స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నవాళ్లు సైతం వ్యక్తిగత సంబంధాల కోసం వెంపర్లాడుతూ ‘‘ప్రశ్నిస్తే, నిలదీస్తే వచ్చేదేముంది…? కామ్‌గా ఉండి కామ్‌గా పనులు ‘చేయించుకుంటే’ పోలా..?’’ అనే స్థాయికి చేరుకున్నారు. రాజీ పడటమే ఈజీ అని భావిస్తున్నారు. చిక్కుల కంటే లెక్కలే మేలని తలుస్తున్నారు.

    నాలుగో స్తంభం పునాది కూలుతున్న సంకేతం:
    అధికారంలో ఉన్న పాలకులకు జర్నలిస్టుల ప్రశ్నల్ని తప్పించుకోవడానికి ఎన్నో సాకులు ఉంటాయి. వాస్తవానికి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి పైన చెప్పుకున్నవేవీ కారణాలుగా ఉండకూడదు. కాంటెక్ట్స్‌కు బదులు కాన్సెప్టు కోసం రంధ్రాన్వేషణ చేయడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైన ప్రశ్నలనూ, రాజకీయేతర ప్రశ్నలనూ ఒకే గాటన కట్టి అదిలించే ధోరణి, అసలు ప్రశ్నించడమే నేరమన్నట్టు బెదిరించే ధోరణి ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇదీ ఒకరకమైన థాట్‌ పోలిసింగే. ‘రాహుల్‌.. ఎక్సట్రాలు ఎందుకైయా..’ అంటూ పాలకులు పరిహాసమాడటాలూ.. వేళాకోళాలు చేయడాలూ.. పైకి వినోదభరితంగానే ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యంలోని ఒక మూలస్తంభం పునాది లోలోపల పెకిలిపోతుండటానికి సంకేతం కూడా.

    (రచయిత సీనియర్ జర్నలిస్టు)

    Previous Article‘మేట్’ పంచుడు… టీఏ దంచుడు… ఆడియో కలకలం!
    Next Article ‘కుండ’ పోకడ… వాన రాకడ! అక్కడ ఇప్పటికీ అదే పద్ధతి!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.