‘కరోనా’ వైరస్ గురించి ప్రపంచ దేశాలే కాదు మన దేశం, మన రాష్ట్రం కూడా ఎంతగా వణికిపోతున్నాయో తెలుసు కదా? ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. పరిశుభ్రత పాటించాలని, సోషల్ డిస్టెన్స్ అనుసరించాలని, ఏమరుపాటు ఏమాత్రం తగదని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22న ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపు కూడా ఇచ్చారు. ఇందుకు దేశ ప్రజానీకం కూడా సంసిద్ధమవుతోంది.
కానీ ఈ సర్కారు సారు వారు ఎవరోగాని ‘కరోనా’ వైరస్ ను గుర్తించేందుకు నిర్దేశించిన థర్మల్ స్క్రీనింగ్ బాధ్యతను ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారో చూడండి. ఎంచక్కా ఫోన్ మాట్లాడుతూ, ఏదో లోకంలో విహరిస్తూ థర్మల్ స్క్రీనింగ్ మెషీన్ ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఎక్కడో తెలియదుగాని ఓ రైల్వే స్టేషన్లో వచ్చీ, పోయే ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ నిర్వహణ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత నిబద్ధతో నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్ వల్ల ఒనగూరే ఫలితం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవలే ‘కరోనా’వైరస్ పాజిటివ్ పేషెంట్ దగ్గరకు ధైర్యంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించిన ఘటనను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ అధికారి మంత్రికన్నా ‘గొప్పోడు’ కాబోలునని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సారువారి ‘స్క్రీనింగ్’ తీరును దిగువన వీడియోలో చూసి ఏమంటారో మీ ఇష్టం మరి!