‘వాల్ స్ట్రీట్ జర్నల్’ అయితే ఏంటి? దానికి కొమ్ములుంటాయా? లేక కొమ్ముల్లాంటి పెన్నులుంటాయా? అది వాషింగ్టన్ పత్రికైనా, వాల్ స్ట్రీట్ జర్నల్ అయినా, ఇంకేదో పత్రికైనా సరే. ముందే చెప్పినట్లు దానికి కొమ్ముల్లాంటి పెన్నులేమీ ఉండవ్. కంప్యూటర్ కీ బోర్డు తప్ప. ఏదో చిన్నా, చితకా విషయం కాదు. అనామక వ్యక్తి అంశం అంతకన్నా కాదు. ప్రపంచ ప్రముఖుడైన సుందర్ పిచాయ్ కు సంబంధించిన వార్త విషయంలో ఆ పత్రిక చేసిన ఘోర తప్పిదం ఇప్పడు తీవ్ర చర్చకు దారి తీసింది.  అసలు విషయమేంటంటే…?

గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ కు కూడా సుందర్ పిచాయ్ సీఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే గూగుల్ సీఈవోగా ఉన్న పిచాయ్ కెరీర్ లో ఈ పరిణామం ప్రమోషన్ గా వ్యాపార దిగ్గజ సంస్థలు అభివర్ణిస్తున్నాయి. ఇదిగో ఈ అంశానికి సంబంధించి వాషింగ్టన్ కు చెందిన ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‘ అనే పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇంగ్లీష్ పత్రికకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. పిచాయ్ నియామాకానికి సంబంధించిన ఈ వార్తను మొదటి పేజీలో వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రముఖంగానే ప్రచురించారు. కాకపోతే హెడ్డింగ్ లోనే కాస్త గిల్లారట. ఇది ఉద్ధేశపూర్వకంగా కాకపోవచ్చు. ‘పిచాయ్’ పేరును కాస్తా ‘పించాయ్’ అని ప్రచురించారట. ‘పించ్’ అంటే ఇంగ్లీష్ భాషలో గిల్లడం అనే అర్థం వస్తుంది తెలుసు కదా? పొరపాటునో, గ్రహపాటునో భాషా దోషం దొర్లిన ఈ హెడ్డింగ్ గురించి నెటిజన్లు జోకులు పేలుస్తున్నారట. తప్పులు దొర్లడానికి వాల్ స్ట్రీట్ జర్నల్ అయినా, మరే పత్రికైనా ఒకటే. ఎందుకంటే మన తెలుగు మీడియాలోని కొన్ని సంస్థల తరహాలో అక్కడ కూడా వ్యవహరించి ఉంటారు. ఎలా అంటే… జిల్లా ఎడిషన్ ఇంచార్జిగా అన్ ఫిట్ అని పరిగణించిన సబ్ ఎడిటర్ ను సెంట్రల్ డెస్క్ కు మార్చి కీలక స్థానంలో కూర్చోబెట్టే పద్ధతిలో అన్న మాట. అదీ విషయం.

Comments are closed.

Exit mobile version