తమ పార్టీ ఆస్తుల విలువను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వెల్లడించారు. తమ పార్టీ రూ. 1,000 కోట్ల ఆస్తులున్న పార్టీగా ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో బుధవారం జరుగుతున్న పార్టీ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడారు. వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్న సంస్థగా టిఆర్ఎస్ పార్టీని ఎవరూ బద్దలు కొట్టలేని కోట… తెలంగాణా కోటగా ఆయన అభివర్ణించారు.
అపజయాలు, విజయాల సమాహారంగా తెలంగాణాను ఉటంకించారు. దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణలో పాలన సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే అందుకే తార్కాణమని, రాష్ట్ర పనితీరుకు మచ్చు తునకగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి శాఖకు కేంద్ర అవార్థులు వస్తున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పారు.
విద్యుత్ రంగంలో దేశమంతా చీకట్లు అలుముకుంటే, తెలంగాణాలో వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పారు. ఈ విషయంలో దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణను ఆయన ప్రస్తావించారు. కర్ణాటక రాష్ట్రంలో అవినీతి కి పాల్పడిన మంత్రిని తొలగించారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని కేసీఆర్ చెప్పారు.
అదేవిధంగా ధరణి పోర్టల్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారని, సాధించవల్సింది చాలా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 2.78 లక్షలని, మనం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనలేని స్థాయిలో పంటలు పండిస్తున్నామని, 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైందని, తెలంగాణ మాదిరిగా కేంద్రంలో ఉన్న బీజేపీ పనిచేస్తే జీఎస్ డీపీ పెరిగేదని కేసీఆర్ అన్నారు.