తెలంగాణాలోని గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఫలితాంగా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికినట్లు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై సమస్యలపై సమీక్షించిన సంగతి తెలిసిందే.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సమస్యలపై చర్చలు జరిపిన పరిశ్రమ ప్రతినిధులు, స్లాబు విధానాన్ని, 40 శాతం రాయల్టీ రాయితీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కోవిడ్​తో గ్రానైట్ రంగం బాగా దెబ్బతిన్నదని, 40 శాతం రాయల్టీ రాయితీ, స్లాబ్ విధానం కొనసాగింపుకు అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రానైట్ పరిశ్రమల సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ, కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ హైదరాబాద్ జిల్లాల గ్రానైట్ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Comments are closed.

Exit mobile version