ఫోటోను నిశితంగా పరిశీలించండి. సిమెంట్ ఇటుకలతో నిర్మాణం. పైన రేకుల కప్పు. వర్షం వస్తే కురవకుండా ప్లాస్టిక్ టార్బాలిన్ల ఏర్పాటు. విస్తీర్ణం కూడా పెద్దదేమీ కాదు. కానీ ఈ గది అద్దె మాత్రం నెలకు అక్షరాలా రూ. 75,200 మాత్రమే. ఆశ్చర్యపోతున్నారా? మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామి టెంపుల్ కు చెందిన ఈ గదికి వేలం పాటలో లభించిన భారీ అద్దె మొత్తం ఇది. నెలకు లభించిన ఆయా మొత్తపు అద్దెను ఏడాదికి గణిస్తే అక్షరాలా తొమ్మిది లక్షల రెండు వేల 400 రూపాయలు. దినసరి ప్రాతిపదికన విభజిస్తే రూ. 2,506 అన్నమాట.

కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయ గోపురం పక్కన దేవాదాయ శాఖ తరపున నిర్మించిన ఈ చిన్న షెడ్డును వ్యాపారులు పోటీపడి మరీ నెలసరి రూ. 75,200 మొత్తానికి వేలంలో దక్కించుకోవడం విశేషం. ఈ చిన్న షెడ్డులో కొబ్బరి కాయలు, పూజా సామాగ్రిని భక్తులకు విక్రయిస్తుంటారు. దేవాదాయ శాఖకు చెందిన ఇటువంటి మొత్తం 21 షెడ్లకు వేలం నిర్వహించగా 14 షెడ్లను వ్యాపారులు వేలంలో దక్కించుకున్నారు. మిగతా ఏడు షెడ్లకు ఇద్దరు చొప్పున మాత్రమే పోటీకి రావడంతో వాటి వేలం పాటను వాయిదా వేశారు.

ఇప్పటి వరకు వేలం పూర్తయిన షెడ్లతో రూ. 75,200 కు దక్కించుకున్న వ్యాపారిదే రికార్డు. ఆ తర్వాత రూ. 30,000 కు మరో షెడ్డు రెండో స్థానంలో నిలిచింది. ఆయా షెడ్లకు వేలం పాటలో దక్కిన మొత్తం దేవాదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Comments are closed.

Exit mobile version