కరోనాతో గజగజ వణుకుతున్న ప్రపంచానికి అమెరికా నుంచే తొలి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందా? కరోనా టీకాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు పరిశీలిస్తే అంతరార్థం ఇదే అనిపిస్తోంది.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ను అమెరికానే సరఫరా చేస్తుందన్నారు. ‘వ్యాక్సిన్ తయారీకి దేశ వ్యాప్తంగా శరవేగంగా ప్రక్రియ కొనసాగుతోంది. అది అందుబాటులోకి వస్తే, వెంటిలేటర్లు ఇతర సామాగ్రిని పంపిణీ చేసిన తరహాలోనే వ్యాక్సిన్ను కూడా అమెరికానే ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంది’ అన్నారు.
కాగా.. ఈ ఏడాది చివరికల్లా లేదా 2021 ఆరంభానికి మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ సర్కార్ బలంగా నమ్ముతోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 45 లక్షలకు చేరువలో ఉంది. 1 లక్షా 52 వేల మంది మహమ్మారికి బలయ్యారు. ఈ విపత్కర పరిణామాల్లో ప్రపంచ పెద్దన్నగా పేరు పొందిన అమెరికా నుంచే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.