మేడిన్ చైనా ‘కరోనా’ వైరస్ మృతుల సంఖ్య ఎంత? అధికారిక లెక్కల ప్రకారం వందల్లో కాదా? అనధికారికంగా అది వేలల్లో ఉందా? అక్కడి ప్రభుత్వం చెబుతున్న గణాంక వివరాలకన్నా 80 రెట్లు ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడి మరణించారా? పది రెట్ల ఎక్కువ మందికి కరోనా వైరస్ సంక్రమించిందా? మరణించిన, బాధితుల సంఖ్యను ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించవద్దని, తక్కువ చేసి చెప్పాలని చైనా ప్రభుత్వం వైద్యాధికారులను ఒత్తిడి చేస్తున్నదా? ఔననే అంటున్నాయి చైనాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు.
‘థైవాన్ న్యూస్’ అనే మీడియా సంస్థ ఇదే అంశాన్ని వెల్లడించింది. మృతుల సంఖ్య, వ్యాధిగ్రస్థుల అంకెను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించవద్దని వైద్యాధికారులపై చైనా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఆయా మీడియా సంస్థ వెల్లడించింది. మరోవైపు చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను కనురెప్ప వాల్చకుండా పరిశీలిస్తున్న చైనాలోని అతిపెద్ద కంపెనీ ‘టెన్ సెంట్’ అనే సంస్థ తన వెబ్ సైట్ లో సంచలన అంశాలను వెల్లడించింది.
ఆయా వెబ్ సైట్ కథనం ప్రకారం ఈనెల 1వ తేదీ వరకు చైనాలో కరోనా వైరస్ వల్ల 24,589 మంది మరణించగా, 1,54,023 మంది వ్యాధి బారిన పడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకన్నా ఇది 80 రెట్లు అధికమన్నది ‘టెన్ సెంట్’ వెబ్ సైట్ వార్తా కథనపు సారాంశం. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన, అలజడి పెరిగింది. అయితే ఆ తర్వాత రోజైన ఈనెల 2వ తేదీన మృతుల సంఖ్య 304, వ్యాధిగ్రస్థుల అంకె 14,446గా ప్రభుత్వ లెక్కలనే ఆయా వెబ్ సైట్ ఉటంకించడం గమనార్హం.
ఇంకోవైపు కరోనా వ్యాధి తీవ్రతకు సంబంధించి ప్రభుత్వ, వైద్య వైర్గాల వివరాలకు పొంతన లేకపోవడం కూడా చైనీయుల్లో మరింత అనుమానాలను కలిగిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రస్తుతం ఈ అంశంపై అనేక వార్తలను పుంఖాను పుంఖాలుగా తమదైన శైలిలో నివేదిస్తున్నాయి.