ఇన్సిడెంట్ 1:

1989 ఎన్నికలకు కొద్ది నెలల ముందు… 1985 ఎన్నికల్లో గెలిచి, తెలుగుదేశం పార్టీ నుంచి వరంగల్ జిల్లా హన్మకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వి. వెంకటేశ్వరరావు అనే ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తూ కాజీపేట జంక్షన్ వరకు వచ్చారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా డ్యూటీలో గల పోలీస్ కానిస్టేబుల్ ఓ వైపు ట్రాఫిక్ ను ఆపేశారు. ఆగిపోయిన వాహనాల వరుసలో గల ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు చిర్రెత్తుకొచ్చింది. ‘నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేను… నా కారునే ఆపుతావా… ఆయ్? అంటూ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు. (దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన గుర్తున్నంత వరకు సారాంశం ఇంతే)

ఈ ఘటనను అప్పటి వరంగల్ జిల్లా ఆంధ్రజ్యోతి (రాధాకృష్ణకు చెందిన ఆంధ్రజ్యోతి కాదు, పాత యాజమాన్య సంస్థ) స్టాఫ్ రిపోర్టర్ మోహన్ రావు వార్త రాశారు. మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో వార్త ప్రచురితమైంది. ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అనుచరగణం జర్నలిస్టు మోహన్ రావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడింది. వరంగల్ నగరంలోని ఆజంజాహి మిల్లు ఎదురుగా, వెంకట్రామా థియేటర్ సమీపంలో జరిగిన ఈ దాడిలో జర్నలిస్టు మోహన్ రావు ప్రాణాపాయం నుంచి చాకచక్యంగా తప్పించుకోగలిగారు. దాడి ఘటనపై జర్నలిస్టు సంఘం గుడ్లురిమింది. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వార్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాజీ కోసం ఎమ్మెల్యే ఎంతగా ప్రయత్నించినా జర్నలిస్టులు ససేమిరా అన్నారు. 1989 సాధారణ ఎన్నికలు సమీపించాయి. అప్పటి సీఎం దివంగత ఎన్టీ రామారావు అసెంబ్లీ ఎన్నికల టికెట్లను ఖరారు చేస్తున్నారు.

హన్మకొండ టికెట్ ఖరారు వంతు రానే వచ్చింది. ఇంటలిజెన్స్ నివేదికలు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉన్నాయి. పత్రికల్లో అతని పర్యటనకు సంబంధించిన ఏ వార్తా కవర్ కావడం లేదని, ఫలితంగా ప్రజల్లో ఎమ్మెల్యేకు గుర్తింపు లేకుండా పోయిందని, టికెట్ ఇస్తే గెలుపు సందేహమన్నది నివేదికల సారాంశం. విషయంపై పూర్తి వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్ జర్నలిస్టుల నిర్ణయానికి మద్ధతు తెలిపే విధంగా వెంకటేశ్వరరావుకు టికెట్ నిరాకరించారు. ఫలితంగా దాస్యం ప్రణయ భాస్కర్ కు అప్పటి ఎన్నికల్లో టికెట్ వచ్చింది. ప్రణయ భాస్కర్ తన రాజకీయ ప్రస్థానంలో మంత్రి స్థాయికి ఎదిగారు. వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం ఆ ఘటనతో పూర్తిగా ముగిసిపోయిందన్నది వేరే విషయం.

ఇన్సిడెంట్ 2:

ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట కేంద్రంగా పనిచేసే కొందరు విలేకరులను 1990 దశకంలో ప్రతిఘటన గ్రూపు నక్సల్ సంస్థ టార్గెట్ చేసింది. అప్పటికే ఉదయం పత్రిక విలేకరి శ్రీహరిని నక్సల్స్ కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న మరో ఇద్దరు విలేకరులనూ ఆయా నక్సల్ సంస్థ హిట్ లిస్టులో చేర్చింది. బతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరు విలేకరులు గోవిందరావుపేట నుంచి బిచాణా ఎత్తేశారు. మరో తీవ్రవాద గ్రూపునకు కొమ్ముకాస్తూ పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్నది ప్రతిఘటన నక్సల్ సంస్థ తీవ్ర ఆరోపణ. ఈ ముగ్గురు విలేకరులూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనార్హం. తమ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని నక్సల్ సంస్థ వాదించింది. తమ పార్టీకి చెందిన అగ్రనేతల ఎన్కౌంటర్ కు వారే బాధ్యులని, ఆయా జర్నలిస్టులకూ చావు తప్పదని ప్రతిఘటన సంస్థ బాహాటంగానే హెచ్చరించింది.

ఇక్కడా జర్నలిస్టు సంఘం జోక్యం చేసుకుంది. తప్పొప్పుల తర్కం కాదు, ఇప్పటికే ఓ జర్నలిస్టును చంపారని, ఆరోపణలు ఎదుర్కుంటున్న మిగతా జర్నలిస్టుల ప్రాణాలు తీసేందుకు తాము అంగీకరించేది లేదని, ఇందుకు విరుద్ధంగా చర్య తీసుకుంటే మీ వార్తల ప్రచురణపై మేమూ ఆలోచించాల్సి ఉంటుందని జర్నలిస్టు సంఘ నేతలు స్పష్టం చేశారు. పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఫలితంగా ప్రతిఘటన నక్సల్స్ వెనక్కి తగ్గుతూ కొన్ని షరతులు విధించారు. ఆమేరకు ఆయా జర్నలిస్టులు గోవిందరావుపేట నుంచి శాశ్వతంగా మకాం మార్చడం మెయిన్ కండిషన్. అందుకు తగిన విధంగానే ఆరోపణలు ఎదుర్కున్నవారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయి, ప్రస్తుతం పే..ద్ద జర్నలిస్టులుగా చెలామణి అవుతూ, విప్లవోద్యమ వీరులుగా తమకు తాము అభివర్ణించుకుంటూ బీరాలు పలుకుతున్నారనేది వేరే విషయం.

ఇన్సిడెంట్ 3:

1998-99 సంవత్సరం. కరీంనగర్ జిల్లా వార్త స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. అప్పట్లో ఈ జిల్లా ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి నేను పనిచేసే పత్రిక సీఎండీకి ఫోన్ చేశారు. ‘మీ రిపోర్టర్ పోలీసు శాఖ పనితీరుపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. అతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ చేయాలి’ అని సీఎండీని కోరారు. ‘ఓకే ఎస్పీ గారూ… నేను మా రిపోర్టర్ ను ట్రాన్స్ ఫర్ చేసే ముందు నాదో చిన్న కోరిక ఉంది… తీర్చాలి’ అని సీఎండీ అన్నారు. ‘ చెప్పండి… తప్పకుండా చేస్తాను’ అని ఎస్పీ సమాధానమిచ్చారు. ‘నాకు మీ కోరుట్ల సీఐ పనితీరు నచ్చలేదు. అతన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలి’ అని సీఎండీ తన కోరికను వెలిబుచ్చగా, ‘ మా డిపార్ట్మెంట్లో మీరెలా జోక్యం చేసుకుంటారు?’ అని ఎస్పీ నిరాకరించారు. ‘నేనూ అదే చెబుతున్నా… మా పత్రికా వ్యవస్థలో మీరెలా జోక్యం చేసుకుంటారు?’ అని పత్రిక యజమాని కమ్ సీఎండీ రివర్స్ ప్రశ్న వేయడంతో ఆ ఎస్పీకి నోట మాట రాలేదు.

ఈ మూడు సంఘటనలు జరిగిన సందర్భంగా నేను ఆయా జిల్లాల్లో పనిచేస్తున్నాను. ఓ రకంగా చెప్పాలంటే ఆయా సంఘటనల పరంపరను ప్రత్యక్షంగా చూసినవాడిని. గుర్తున్నంత వరకు ఉదంతాల మొత్తం సారాంశం మాత్రం అంతే. ఇప్పుడీ ఘటనల ప్రస్తావన దేనికంటే… ‘తమను అంతలా అవమానిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితిలో ఇవ్వాళ జర్నలిస్టులు లేరు. యాజమాన్యాల సహకారం కూడా ఉండడం లేదు.’ అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఆదివారంనాటి ‘కొత్తపలుకు’ కాలమ్ లో తీవ్రంగా ఆవేదన చెందారు. తెలంగాణా సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో రాధాకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. కానీ…

పాలకుల కనుసన్నల్లో, వారి ప్రయోజనాలకు అనుగుణంగా పత్రికలను నిర్వహిస్తూ, సీఎం స్థాయి నేతలతో ఎదురుగా కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెబుతూ, ముఖ్యమంత్రులకే సలహాదారులుగా మారిన యజమానుల కాలంలో సాధారణ జర్నలిస్టులకు రాజకీయ నేతలను ప్రశ్నించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందనేది ఓ సందేహం. సర్కార్ విదిల్చే జాకెట్ యాడ్లకు, బ్రాకెట్ ప్రకటనలకు, స్థలాల కేటాయింపులకు, ప్రత్యేక ప్యాకేజీలకు, ఎలక్షన్ పెయిడ్ ఆర్టికల్స్ కు పత్రికల, టీవీల యాజమాన్యాలు ‘కక్కుర్తి’పడి జర్నలిస్టులను బలి పశువులుగా చేస్తున్న ఉదంతాల ప్రస్తుత కాలంలో ఎవరు ఎవరిని ప్రశ్నించాలన్నదే అసలు ప్రశ్న. ఒకవేళ ప్రశ్నించినా సాయంత్రానికి సదరు జర్నలిస్టు ఉద్యోగానికి గ్యారంటీ ఉంటుందా? అనేది మరో ప్రశ్న. అందుకే మీడియాలో ప్రస్తుతం యథా యజమాని… తథా జర్నలిస్టు అండ్ పొలిటిషియన్ అన్నమాట.

అన్నట్టు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏబీఎన్ ఆర్కే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన ప్రైవేటు సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికీ యూ ట్యూబ్ లో ‘వ్యూస్’ను ఇంకా పెంచుతున్నట్లుంది. అంతేకాదు… తాజాగా లాక్ డౌన్ పరిణామాలను సాకుగా చూపి ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఉద్యోగాలకు యాజమాన్యం ఎసరు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై ‘తెలుగు జర్నలిస్టు’ పేరుతో బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతున్నట్లుంది. ఆయా అంశాల్లో మీరేమంటారు ఆర్కే గారూ?

-ఎడమ సమ్మిరెడ్డి

Comments are closed.

Exit mobile version