‘రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందం’ సామెత తెలుసుగా? నీరో చక్రవర్తి సంగతేమోగాని జపాన్ ప్రధాని షింజో అబే మాత్రం అచ్చం ఇదే తరహా చేష్టలతో కూడిన వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్లకు బుక్కయిపోయారు. కరోనా మహమ్మారి వల్ల జపాన్ దేశంలో ఇప్పటికే ఏడువేల మంది బాధితులుగా మిగిలారు. ఇటువంటి కల్లోల పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ప్రధాని షింజో నిర్ణయించారు. ఇంకా అనేక చర్యలు కూడా చేపట్టారు.

అంతా బాగానే ఉంది. కానీ… ‘నేను నా ఫ్రెండ్స్ ను కలుసుకోలేను. దావత్ లకు వెళ్లలేను. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కష్టపడుతున్నారు. వారి విషయంలో కృతజ్ఞత చాటుకోవాలి’ అంటూ ప్రధాని షింజో ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే నెటిజన్లు జపాన్ ప్రధానిని ఓ రేంజ్ లో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ‘ఇంతకీ మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరెవరో మీకైనా అర్థమవుతోందా? కరోనాతో ప్రజలు భయానక పరిస్థితిని ఎదుర్కుంటుంటే… బాధ్యతను విస్మరించి, ఇంత విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పే పద్ధతి ఇదేనా?’ అంటూ జపాన్ ప్రధాని తల బొప్పి కట్టేలా నెటిజన్లు ‘ట్రోలింగ్’కు దిగారు.

ఇంతకీ జపాన్ ప్రధాని షింజో అబే పోస్టు చేసిన వీడియో ఏమిటో తెలుసా? ఓ వ్యక్తి గిటార్ వాయిస్తున్న దృశ్యపు వీడియో అది. సేవలందిస్తున్న డాక్టర్లకు ధన్యవాదాలు తెలపాలని కోరుతూ పోస్ట్ చేసిన ఆ వీడియోకు తోడుగా తాను హాయిగా సోఫాలో కూర్చుని, టీ తాగుతూ, టీవీ చూస్తూ, తన పెంపుడు కుక్క పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఠీవీగా హొయలు పోతున్న ప్రధాని షింజో వీడియో దృశ్యాలను చూసి నెటిజన్లు భగ్గుమన్నారు.

జపాన్ ప్రధాని షింజో అబే ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయా వీడియోలను దిగువన మీరూ చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version