అగ్ర రాజ్యాధినేత, ప్రపంచ పెద్దన్న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురద గురించి తెలిసిందే కదా? కరోనా టెస్టుల అంశంలో తమ దేశమే గొప్ప అని, తమదే నంబర్ వన్ స్థానమంటూ చేసిన ప్రకటనపై ఇద్దరు మహిళా జర్నలిస్టులు తమ ప్రశ్నలతో ఆ మధ్య ట్రంపును చెడుగుడు ఆడుకున్న విషయమూ విదితమే. మహిళా విలేకరుల ప్రశ్నల ధాటికి తట్టుకోలేక మీడియా సమావేశం మధ్యలోనే ట్రంప్ నిష్క్రమించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్ల, నర్సుల గురించి ట్రంప్ తన నోటి కంపును వెదజల్లారు. కరోనా వైరస్ తో పోరాడుతూ చనిపోతున్న డాక్టర్ల, నర్సుల మరణం ఎంతో అందంగా ఉందని వ్యాఖ్యానించి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఇవన్నీ పాత అంశాలే కదా? మళ్లీ వాటి ప్రస్తావన ఎందుకూ… అంటే…?
డొనాల్డ్ ట్రంప్ చేసే ఇటువంటి కంపు వ్యాఖ్యల గురించి ఎన్ని పేరాల్లో వార్తా కథనం రాసినా నిష్ప్రయోజనమేనని నిరూపిస్తోంది ఈ కార్టూన్. కార్టూన్ అంటేనే అదీ. లక్షల అక్షరాల రాతల్లోనూ చెప్పలేని భావాన్ని కార్టూనిస్టులు తమ ‘గీత’ల ద్వారా పలికిస్తుంటారు. కరోనా నేపథ్యంలోనూ తాను మాస్కు ధరించే ప్రసక్తే లేదని ఆ మధ్య ట్రంప్ ఎక్కడో… ఏదో సందర్భంలో వ్యాఖ్యానించినట్టు గుర్తు. కానీ ఎట్టకేలకు ట్రంప్ మాస్క్ ధరించినట్లున్నారు. ‘మాస్క్’లో నేను అందంగా కనిపిస్తాను’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ ‘సాక్షి’ కార్టూనిస్టు శంకర్ గీసిన కార్టూన్ ఇది. ‘…. వావ్! నిజమే సార్’ అని ట్రంప్ పక్కనే గల అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లుగా వెటకరించారు శంకర్. ఇంతకీ కార్టూన్ భావం మీకూ అర్థమైనట్లేగా..?
‘ఇలా మాస్కేసుకుని కాస్త నోరు మూస్కో… కంపు వ్యాఖ్యలు చేయకు ట్రంపూ…’ అనే భావం ఈ పాకెట్ కార్టూన్లో స్ఫురించడం లేదూ? అదీ సరైన కార్టూనిస్టు ప్రదర్శించే వ్యంగ్య చిత్రపు సత్తా. ఈ భావం సరైంది కాదనుకుంటే మీ భావానికి అనుగుణంగా కార్టూన్ ను అర్థం చేసుకోవచ్చు. బహుళార్థ భావాలూ ఈ కార్టూన్లో దాగి ఉన్నాయ్… మరి!