సండే స్పెషల్ ఆర్టికల్ /✍️ గోపాల బాలరాజు
పొలం గట్లపై నడిపించి,
తడబడకుండా నిలదొక్కుకోవటం నేర్పింది.
అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడైపొతే,
నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.
చెలక పక్కన నీటి చెలిమలు తీయించి,
పరిశోధించే తత్వం నేర్పింది.
సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
అన్వేషణ ఎలా జరపాలో నేర్పింది.
తుమ్మ ముల్లు, పల్లేరుకాయల గుచ్చులతో
జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.
వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు తీయించి
పది పైసల సంపాదన నేర్పింది.
ఆవులతో, గేదెలతో, కోళ్లతో స్నేహం చేయించి,
ప్రాణికోటిపై బాధ్యత పెంచింది, ప్రేమతత్వాన్ని నేర్పింది.
రాగడి మట్టితో బండి గిర్రలు చేయించి,
సొప్పబండ్లకు తొడిగించి పనితనం నేర్పింది.
వేలాడే పిచుక గూళ్ళు, చెట్ల కొమ్మల్ల కొంగ గూళ్ళు చూపించి
బొమ్మరిల్లు కట్టించి, చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.
బతుకమ్మ, తంగేడు, గునుగు పూలకోసం, పొలంబాట పట్టించి, ఇంటి ఆడబిడ్డల పట్ల బాధ్యతను నేర్పింది.
పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
గుంటగల్జేరు ఆకు పసరు పోయించి ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.
చెట్టుమీద మామిడికాయను
గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.
నిండు బిందెను నెత్తిమీద పెట్టి, నీళ్లు మోయించి,
జీవితమంటే బరువు బాధ్యత అని నేర్పింది.
కటిక, నాటు ముడులు నేర్పించి పాల శిక్కం,
కాగితం పొట్లాలు, అరికట్లాలు కట్టించి, బతికే ఒడుపు నేర్పింది.
బావి నుండి బొక్కెనతో నీళ్లు చేదించి,
బ్యాలన్సుగా బరువులాగటం నేర్పింది.
ఇంటి ముంగిటకు అతిథి దేవతలు హరిదాసులు
గంగిరెద్దులను రప్పించి, ఉన్న దాంట్లో కొంత పంచే గుణం నేర్పింది.
ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,
ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.
పచ్చపచ్చని మోదుగాకుల విస్తరిలో,
అన్నం కింద పడిపోకుండా తినే ఒద్దికను నేర్పింది.
మోదుగాకు విస్తరాకులు కుట్టించి,
అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.
ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి,
కాకి ఎంగిలి పేరుతొ దోస్తులతో పంచుకోవటం నేర్పింది.
ముళ్ళు గుచ్చుకోకుండా చెట్టు ఎక్కి,
ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పును నేర్పింది.
ఎండా కాలంలో తుమ్మ చెట్లకు బంక సేకరణ,
స్వయం సంపాదన ధోరణి నేర్పింది.
మైదాకును తెంపించి, దంచించి, చేతులకు అద్దించి,
రంగులు వికసించడం చూపించింది.
వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి,
బాణాలతో వస్తు తయారీ మెళకువలు నేర్పింది.
అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా
వరుసలతో, ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.
అందుకే.. మా ఊరు నాకు ఎంత ఇష్టం అంటే,
మా అమ్మా, నాయిన ఎంత ఇష్టమో, అంత ఇష్టం మా ఊరు.
నేను ఈ ఊర్లో పుట్టి పెరిగాను అని చెప్పటానికి,
సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా.
ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన మా ఊరుకే మేం అంకితం.
బతుకుదెరువుకు ఎక్కడికెళ్లినా.. మా ఊరికే వస్తాం.
చివరిదాకా ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఛస్తాం…
(ఇది 1970-80-90లలో మేం అనుభవించిన జీవితం..
మా అనుభూతులను పంచుకునే ఆత్మీయుల కోసం…)