బేషరతుగా విధుల్లో చేరాలని ఒకింత అభ్యర్థనతో, మరింత బెదిరింపులతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం ఇచ్చిన పిలుపును ఆర్టీసీ కార్మికులు బేఖాతర్ చేశారు. గడువులోపు విధుల్లో చేరకుంటే మొత్తం బస్సు రూట్లను ప్రయివేటీకరిస్తామని ప్రకటించినా కార్మికులు బెదిరిన దాఖలాలు లేవు. మా సీఎం సారు పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తున్నదని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బారులు తీరి డిపోల బాట పట్టారంటూ అధికార పార్టీ ప్రసార సాధనాలు ఊదరగొట్టిన ఉదంతాల డొల్లతనం వెల్లడైంది.

‘ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే. వారి పొట్ట కొట్ట ఉద్దేశం మాకు లేదు. మరో అవకాశం ఇస్తున్నా. బేషరతుగా డ్యూటీలో చేరండి. ఇందుకు మూడు రోజుల గడువు విధిస్తున్నా. ఈనెల 5వ తేదీ అర్థరాత్రిలోగా డ్యూటీలో చేరిన వారికి ఏ ఇబ్బందీ ఉండదు. గడువు ముగిశాక మాకు ఇక ఉద్యోగితో సంబంధమే ఉండదు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభ్యర్థన పిలుపునకు ఆర్టీసీ కార్మికులు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ‘ఆర్టీసీ సమ్మె ముగియడం కాదు… ఆర్టీసీనే ముగుస్తున్నది…కార్మికులను ప్రభుత్వం తొలగించలేదు. వాళ్లే సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారు’ అనే హుంకరింపుల నుంచి ‘మరో గడువు’ అంటూ మానవతా దృక్పథం పదాన్ని సీఎం ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం లభించలేదు. తాజా సమాచారం ప్రకారం సీఎం పిలుపునకు స్పందించి కేవలం 360 మంది మాత్రమే డ్యూటీలో చేరేందుకు లేఖలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందులో బస్ భవన్ లోని పరిపాలనా సిబ్బందే 200 మంది వరకు ఉండగా, మిగతా వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపోలకు చెందినవారుగా సమాచారం. టీఎస్ఆర్టీసీకి చెందిన 49 వేల పైచిలుకు కార్మికుల్లో 360 మంది వరకు మాత్రమే డ్యూటీలో చేరడానికి లేఖలు ఇచ్చారంటే సీఎం పీలుపునకు స్పందించిన కార్మికుల సంఖ్య ఒక్క శాతానికి కూడా చేరకపోవడం గమనార్హం. మరోవైపు తమ డిమాండ్లు పరిష్కరించేవరకు డ్యూటీలో చేరేది లేదంటూ కార్మికులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,100 ప్రయివేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తున్నట్లు కూడా సీఎం ఈనెల 2వ తేదీన ప్రకటించారు. విధించిన గడువులోపు…అంటే 5వ తేదీ అర్థరాత్రిలోగా బేషరతుగా విధుల్లో చేరకుంటే మరో 5 వేల ప్రయివేట్ బస్సులకు కూడా పర్మిట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు వెరవకుండా ఐక్యంగానే ఉన్నట్లు బేషరతు చేరికల 360 సంఖ్య స్పష్టం చేస్తోంది. ఆర్టీసీ ప్రయివేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, ఈ సంస్థలో 31 శాతం కేంద్రం వాటా ఉందని, ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి అనివార్యమని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్థామరెడ్డి ప్రకటించారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తూనే తమ కార్యచరణను కూడా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

ఎన్నిక ఏదైనా తమదే విజయమని, తమకు ప్రజల మద్ధతు ఉందని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం పాలక పార్టీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం తమదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పిలుపునకు స్పందించి కాకలు తీరిన రాజకీయ నేతలు కూడా అధికార పార్టీలో చేరి ప్రత్యేక రాష్ట్ర అభివద్ధి ఫలాలను ఆస్వాదిస్తున్నారు. అయిదేళ్ల క్రితంనాటి విషయం కాదు…పది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, డీటీపీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ చేస్తున్న అభివ్ధద్ది పనులకు ఆకర్షితులై అధికార పార్టీ పంచన చేరారు. ప్రజాప్రతినిధులే కాదు అనేక మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి పిలుపును ఆర్టీసీ కార్మికులు బేఖాతర్ చేయడానికి గల కారణాలపై జర్నలిజంలో కాకలు తీరిన ఓ పెద్దాయన ఏమన్నారో తెలుసా? ‘కేసీఆర్ చెప్పినావినడం లేదు…ఎందుకు?’ అనే శీర్షికన TS29 ప్రచురించిన వార్తా కథనాన్ని చదివిన ఆయన ఆర్టీసీ కార్మికుల మొక్కవోని ధైర్యంపై ఇలా స్పందించారు.

‘బెదిరింపులతో ఆర్టీసీ సమ్మె అంతం కావడానికి ఆర్టీసీ కార్మికులు నాటి ఆంధ్రా పాలకులు కాదు. సోనియాగాంధీ అంతకంటే కాదు. వాళ్లు కూడా తెలంగాణా వారే.’

Comments are closed.

Exit mobile version