చిరంజీవి ఠాగూర్ సినిమా చూసే ఉంటారు కదా? అవినీతి పరుల భరతం పట్టే దిశగా కొందరు ప్రభుత్వ అధికారులను ఏసీఎఫ్ (యాంటీ కరప్షన్ ఫోర్స్) పేరుతో కిడ్నాప్ చేసి, వారి అవినీతి చరిత్రను బహిర్గతం చేస్తూ ఠాగూర్ పాత్ర వారిని చంపేస్తుంటుంది. దాంతో అవినీతికి పాల్పడుతున్న వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతుంటారు. ఓ ప్రభుత్వ శాఖలో పనిచేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర ఠాగూర్ చర్యలకు భయకంపితుడై తాను తీసుకున్న లంచం డబ్బు మొత్తంతో కూడిన సూట్ కేస్ ను వెనక్కి ఇస్తుంటుంది.  

ఇదిగో…పై ఫొటోలోని ఈ ఎమ్మార్వోను చూడండి. అచ్చం ఠాగూర్ సినిమాలోని సన్నివేశాలను తలపించేవిధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భయంతో వణికిపోతూ తీసుకున్నఈ చర్యను ఆమె ముందు జాగ్రత్తగా అభివర్ణిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలో తెలంగాణాలోని రెవెన్యూ అధికార యంత్రాంగం తీవ్ర భయాందోళనకు గురవుతూ, తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయారెడ్డి ఘటన తెలంగాణా రెవెన్యూ శాఖనే కాదు పొరుగున గల ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులనూ భయకంపితులను చేస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో ఉమామహేశ్వరి తన ఛాంబర్ లో అడ్డంగా తాడు కట్టారు. తన కుర్చీ సమీపానికి ఎవరూ రాకుండానట. ఎవరైనా ఏదేని సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చి ఇచ్చే దరఖాస్తులను తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలికి ఎవరినీ రానివ్వరాదని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారట. ఇదేం పని మేడమ్? అని విలేకరులు తాడు కట్టిన తీరుపై వివరణ కోరగా, ‘మా జాగ్రత్త మేం తీసుకోవాలి’ కదా? అని సమాధానం చెప్పారట. అంతగా బాగానే ఉంది కానీ మేడమ్…ఈ తాడు పెట్రోల్ వంటి మండే ద్రవ పదార్థాలను నిలువరిస్తుందా? అన్నదే అసలు ప్రశ్న. అంతే కాదు…ఎక్కడో తెలంగాణాలో జరిగిన ఘటనకు స్పందించి పత్తికొండ ఎమ్మార్వో మేడం ముందస్తు జాగ్రత్త ఎందుకు తీసుకున్నారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి.

Comments are closed.

Exit mobile version