బెల్లం ఉన్న చోటనే కదా ఈగలు వాలుతుంటాయ్..? అధికారం ఉన్నచోటికే కదా.. విపక్ష పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు చేరాల్సింది? పలు ఉందంతాల్లో కనిపించిన దృశ్యాలు ఇవే కదా? ‘అధికార పార్టీకి చెందిన అధినాయకుడు చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై చేరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ మారాల్సి వచ్చింది. మేం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత అభివృద్ధే మాకు ముఖ్యం..అధికార పార్టీ విధానాలు నచ్చాయ్…’ వంటి డైలాగ్ లను వదిలేయండి. ఓటు వేసిన ఓటరు చేతికి సిరా మరక ఆరకముందే పార్టీ కండువాలు మార్చిన కొందరు ఎమ్మెల్యేలను చూసి తెలంగాణాలో ఏడాది మాత్రమే పూర్తయింది.
అధికార పార్టీ వైపు ఆకర్షితులు కావడం ప్రస్తుత రాజకీయాల్లో ఓ ఫ్యాషన్ అన్నది వేరే విషయం. అధికార పార్టీలో చేరితే ఏదో ఓ ప్రయోజనం నెరవేరడం ఖాయం. కాంట్రాక్టులు దక్కవచ్చు. పాత బిల్లులు వెంటనే వసూలు కావచ్చు. పదవులు అలంకరించవచ్చు. అవసరం, అవకాశాన్ని బట్టి పార్టీ మారినందుకు ఇటువంటి అనేక రూపాల్లో ప్రతిఫలం లభించవచ్చు. రూ. 500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ఆశ చూపినా నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
సరే ఇక అసలు విషయానికి వద్దాం. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియని అయోమయ స్థితి ఏర్పడినపుడు జంపింగ్ జిలానీలు అవకాశాన్ని, అవసరాన్ని బట్టి పార్టీ మారుతుంటారు. సాధారణ ఎన్నికల అనంతరం జరిగే స్థానిక ఎన్నికల్లోనైనా, మరే ఇతర ఎన్నికల్లోనైనా ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా వస్తుంటాయి. అరుదుగా మాత్రమే అధికార పార్టీలు చేదు ఫలితాలను చవి చూస్తుంటాయి. ఎందుకంటే అధికార పార్టీని కాదని మరో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరగదనే అభిప్రాయం మెజారిటీగా ఉంటుంది కాబట్టి. కానీ సాధారణ ఎన్నికలు ముగిసి, స్థానిక ఎన్నికల్లోనేగాక, హుజూర్ నగర్ వంటి ఉప ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న అధికార పార్టీని వీడి ఇతర పార్టీ తీర్థం పుచ్చుకుంటారా ఎవరైనా నాయకులు? ఇక్కడ అసలు విశేషం అదే మరి.
కరీంనగర్ కేంద్రంలోని నగరపాలక సంస్థలో మాత్రం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తోంది. ఫొటోలో మీరు చూస్తున్న దృశ్యం ఇందుకు సంబంధించిందే. చొప్పరి జయశ్రీ వేణు అనే తాజా మాజీ కార్పొరేటర్ దంపతులు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం గమనార్హం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంతో ఈ దంపతులు కాషాయ జెండా తీర్థం పుచ్చుకున్నారు. ఇది పాచి వార్త కాదు. మంగళవారం నాటి తాజా ఘటనే. జయశ్రీ వేణు దంపతులకు తమ పార్టీ టికెట్ లభించే అవకాశం లేకనే బీజేపీలోకి వెళ్లారని అధికార పార్టీ నేతలు తమకు తాము సర్ధిచెప్పుకోవచ్చు. మంత్రి గంగుల కమలాకర్ తో పొసగకపోవడం వల్లనే పార్టీ మారారని లైట్ గా తీసుకోవచ్చు. పార్టీ అధినేతకు కూడా ఇదే విషయాన్ని నివేదించవచ్చు.
కానీ గుర్తుంది కదా? గత ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ సార్ కు ఏమాత్రం రుచించని నాలుగు పార్లమెంట్ స్థానాల ప్రతికూల ఫలితాల్లో కరీంనగర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్ ఎంపీగా పోటీ చేసి ఏం చేస్తాడులే.. అని టీఆర్ఎస్ నేతలు అప్పట్లో చాలా ఈజీగా తీసుకున్నారు. కానీ ఏం జరిగింది? కేసీఆర్ కుడి భుజమైన బోయినపల్లి వినోద్ కుమార్ నే సంజయ్ ఓటమి బాట పట్టించారు. ‘ఒక్క చోట ఓడినా పదవులు ఊడుతాయ్’ అంటూ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదిగో ఈ పరిస్థితుల్లోనే అధికార పార్టీని వీడి కాషాయ పార్టీకి జై కొడుతున్న దృశ్యాలు కరీంనగర్ వంటి గులాబీ కోటలో కనిపిస్తున్నాయి. ఏంటో…ఏ పరిణామాలకు దారి తీస్తాయో మరి.. కేసీఆర్ ఎంపీగా ప్రతినిధ్యం వహించిన చోట బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న కొరకరాని చర్యలు. వేచి చూడాల్సిందే.