Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»సాహో… కేసీఆర్ సార్, సర్కార్ ‘అసైన్డ్’ భూముల పాట!!

    సాహో… కేసీఆర్ సార్, సర్కార్ ‘అసైన్డ్’ భూముల పాట!!

    January 7, 20203 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 kcr

    ‘సంచిల సంస్కాన’ లేనప్పుడు సర్కారు పెద్దల ఆలోచనలు పరి పరి విధాలుగా పరిభ్రమిస్తుంటాయి కాబోలు. అంటే పూట గడవని స్థితిలో ఇంట్లోని చెంబూ, తపేలా అమ్ముకునే యోచన టైపు అన్నమాట. ఈ ఆలోచన మంచికా? చెడుకా? అనే ప్రశ్నలు అప్రస్తుతం. ‘ఇజ్జత్’ పోకుండా ఇల్లు గడవడమే అసలు లక్ష్యం. అప్పు చేసినా, సప్పు చేసినా, ఆస్తులు అమ్మినా అభివృద్ధి కోసమే మరి. అప్పులు చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదని పాలక పార్టీ నేతలు అనేక సందర్భాల్లో ఇప్పటికే సెలవిచ్చారు కదా! ఇదిగో తెలంగాణా సర్కారు వారి తాజా ఆలోచన కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలక వర్గాల్లో హాట్ టాపిక్.

    తెలంగాణా ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇందులో ఎటువంటి దాపరికం కూడా లేదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన మొత్తంలో నిధులు రావడం లేదని, అందుకే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని పాలకులు కొంత కాలంగా చెబుతూనే ఉన్నారు. తన వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే నాయకులు ‘చాయ్ తాగి పోవాలే తప్ప, పైసల్ అడగొద్దు’ అని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ సారే చెబుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. సరే.. కారణం ఏదైనప్పటికీ సర్కారుకు ఇప్పుడు కాసులు కావాలి. ఇప్పటికిప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా మరి? అందుకే.. సంపదను సృష్టించడంకన్నా, ఒకప్పటి సాధారణ ఆస్తి ప్రస్తుతం అసాధారణ సంపదగా మారిందని, దాన్ని వేలం వేస్తే ‘సంస్కాన’ భారీ ఎత్తున సమకూరుతుందనే ఆలోచన ప్రభుత్వ పెద్దలకు వచ్చిందట.

    ts29 SAKSHI2

    ఇందులో భాగంగానే రాజధాని శివారు గ్రామాల్లోని అసైన్డ్ భూముల లెక్కలు తీసే పనిలో పడిందట తెలంగాణా సర్కార్. సాక్షి పత్రిక ప్రచురించిన వార్తా కథనం ప్రకారం.. రాజధాని శివారు గ్రామాల్లో పేదలకు అప్పుడెప్పుడో అసైన్ చేసిన భూములను తిరిగి  తీసుకునే యోచన ప్రభుత్వం చేస్తున్నది. హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలు నింగినంటుతున్న నేపథ్యంలో అసైన్డ్ భూములను తిరిగి తీసుకుని, వాటిని విక్రయించడం లేదా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు వేలం ద్వారా కట్టబెట్టడం ద్వారా ఖజానా నింపుకునే ప్రక్రియకు అంకురార్పణ చేశారు. ఈమేరకు రెవెన్యూ అధికార యంత్రాంగం సర్వే కూడా నిర్వహించింది. మొత్తం 1,636 ఎకరాల పరాధీన/లబ్ధిదారులకు చెందిన అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలింది. వీటిని బడా సంస్థలకు విక్రయిస్తే రాష్ట్ర ఖజానాలో రూ. 5,745 కోట్ల మొత్తం జమయ్యే అవకాశం ఉందట. క్లుప్తంగా సాక్షి పత్రిక ప్రచురించిన వార్తా కథనంలోని సారాంశం ఇదే.

    అయితే నిరుపేదల జీవన భ్రుతిలో భాగంగా అసైన్ చేసిన భూములను తిరిగి తీసుకునేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఎప్పుడైనా, ఎన్నడైనా అసైన్ చేసిన భూములను తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ తిరిగి ఆ భూములను తీసుకునేందుకు అవసరమైన ‘ప్రజా ప్రయోజనం‘ అందులో ఇమిడి ఉండాలన్నదే అసలు సూత్రంగా రెవెన్యూ అధికార వర్గాల వాదన. ఈ శాఖకు చెందిన కొందరు అధికారుల నిర్వచనం ప్రకారం.. అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నిర్దిష్టమైన ప్రజా ప్రయోజనపు కారణాలు చూపాల్సి ఉంటుంది. తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రతి చదరపు గజపు విస్తీర్ణపు భూమిని ప్రజాప్రయోజనం కోసమే ఉపయోగించాలి. ప్రాజెక్టుల, సాగునీటి కాల్వల నిర్మాణం, ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, సెజ్ లు, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ పరిశోధనా సంస్థలకు వినియోగం తదితర అవసరాలకు వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రజా ప్రయోజనం అనివార్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పుడైనా ఇటువంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుందని భూమి ‘అసైన్’ చేసిన పత్రంలోనే ‘షరతు’ ఉంటుంది.

    ts29 SAKSHI

    అసైన్ చేసిన భూమిని నిర్దేశిత ప్రయోజనానికి విరుద్ధంగా వినియోగించిన సందర్బంలోనూ లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు, నివాస ప్లాట్లను వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తే ‘ఉల్లంఘన’ కింద పరిగణించి అసైన్డ్ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకునే అవకాశం ఉంది. కానీ ఖజానాలో ‘సంస్కాన’ లేదనే నెపంతో అసైన్డ్ భూములను తిరిగి తీసుకోవచ్చా? అనే సందేహాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

    రాజధాని శివార్లలోని అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంలో ప్రభుత్వం ఎటువంటి ప్రజా ప్రయోజనాన్ని తెరపైకి తీసుకువస్తుందన్నది కూడా మరో ప్రశ్న. రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో పేదలకు అసైన్ చేసిన భూములను స్వాధీనం చేసుకుని వేలం వేయడం ద్వారా లభించే ఆదాయంతో ఖజానా నింపాలన్నదే ప్రభుత్వ లక్యంగా వార్తా కథనపు సారాంశం. బహుళజాతి కంపెనీలకు ఈ భూములను విక్రయిస్తే ప్రభుత్వ ఖజానా నిండవచ్చు. కానీ ఆయా భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ‘ప్రజా ప్రయోజనం’ అనే అంశాన్ని నిర్దిష్టంగా చూపాల్సి ఉంటుందన్నది రెవెన్యూ అధికార వర్గాల వాదన. ఈ పరిస్థితుల్లో బడా సంస్థలకు భూములను విక్రయించేందుకు స్వాధీనం చేసుకునే అసైన్డ్ భూముల విషయంలో సర్కారు పెద్దలు ఎటువంటి ‘ప్రజా ప్రయోజనం’ చూపుతారనే ప్రశ్న తలెత్తుతోంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా చందాన, ‘శతకోటి ఆర్థిక మాంద్యాలకు అనంతకోటి ప్రజా ప్రయోజనాలు’ తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదన్నది రాజకీయ పరిశీలకుల వాదన.

    Previous Articleజగన్ ‘విశాఖ’ పాలన ఎప్పుడంటే?
    Next Article కరీంనగర్ గులాబీ కోటలో సంజయ్ ‘తవ్వుడు’!

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.