తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల వేడి నేపథ్యంలోనే ‘కేటీఆర్’ కాబోయే సీఎం అంటూ జరుగుతున్న ప్రచారానికి ఇద్దరు మంత్రులు శ్రుతి కలపడం రాజకీయ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ అనంతరం కేటీఆర్ సీఎం అవుతారని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియాగాంధీ తరహాలో కేసీఆర్ సూపర్ సీఎంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఇటీవల ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇదే దశలో సీఎం కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. గడచిన వారం రోజుల వ్యవధిలోనే ‘కేటీఆర్’ కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే అత్యంత ప్రజాదరణ గల వ్యక్తిగా మంత్రులు అభివర్ణించిన తీరు అనేక ఊహాగానాలకు అస్కారం కలిగిస్తోంది. రాజకీయంగా తనను అందరూ వాడుకున్నారని, కేసీఆర్ మాత్రమే న్యాయం చేశారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేటీఆర్ విషయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే చదవండి.

‘కాంగ్రెస్ పార్టీల నెహ్రూ బిడ్డ ఇంద్రగాంధీ అయింది. ఇంద్రగాంధీ కొడుకైండు. మల్ల కొడుకు కొడుకైండు. అరె..ఇయ్యాల తెలంగాణ తెచ్చుకున్నం. వాళ్లు స్వాతంత్రం తెచ్చుకున్నోల్లని సాధిచ్చుకున్నరు. కేసీఆర్ తర్వాత కేటీఆరే అయితడు. దాంట్ల తప్పేమున్నది? అదెప్పుడో కేసీఆర్ గారే నిర్ణయిస్తడు. అది కేసీఆర్ గారు నిర్ణయించాలె. కేటీఆర్ గారు సమర్ధుడు. అన్ని తీర్ల సమర్ధుడు. పార్టీని నడిపిస్తున్నడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోపట ఆయన నాయకత్వంల్నే విజయం సాధించాం. అదే తీర్గ పార్లమెంట్ ఎన్నికల్ల ఆయన నాయకత్వంల్నె, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయింతర్వాతనే విజయం సాధించాం. జిల్లా పరిషత్ గెల్చుకున్నం, సర్పంచ్ లు గెల్చుకున్నం. రేపు మున్సిపాల్టీ గూడ ఆయన నాయకత్వంల్నె గెలుస్తం. సమర్థమైన నాయకుడు. ఏదో శెంద్రబాబు గారి తీర్గ, లోకేష్ తీర్గ అసమర్థడు గాదు. కాంగ్రెస్ పార్టీల రాజీవ్ గాంధీ…మన.. రాహుల్ గాంధీ తీర్గ అసమర్ధుడు గాదు. సమర్థమైన నాయకత్వం ఉన్నది. కేసీఆర్ గార్కి ఎంత సమర్థతున్నదో…కేటీఆర్ గార్కి గూడ అంత సమర్థతున్నది.

తెలంగాణా రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడడం గమనార్హం. కేటీఆర్ ను దయాకర్ రావు పొగిడితే తమకు అభ్యంతరం లేదని, కానీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ కుటుంబంతో పోల్చడమేమిటని ప్రశ్నించారు.

అంతకు ముందు సరిగ్గా వారం రోజుల క్రితం..అంటే గత నెల 27వ తేదీన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ యువ నాయకుడు కేటీఆర్ లో ఒరిజినాలిటీ ఉందని, ఆయన సీఎం కావాలని అందరూ కోరుకుంటారని అన్నారు. కేసీఆర్ తర్వాత ప్రజాదరణ, నమ్మకం ఉన్నవ్యక్తి కేటీఆరేనని మంత్రి కొనియాడారు. అంతేకాదు క్లాస్ లో ఫస్ట్, సెకండ్ విద్యార్థులుంటారని, రేపేదైనా పోటీకి వెళితే ఫస్ట్ ఎవరొస్తరంటే చెప్పగలం…ఫెయిలైన, మామూలు మార్కులతో పాసైన వారి గురించి చెప్తామా? అని కూడా మంత్రి వ్యాఖ్యానించారు.

కేటీఆర్ పట్టాభిషేకానికి అంతర్గతంగా రంగం సిద్దమవుతోందనే ప్రచారం నేపథ్యంలోనే ఒక్కో మంత్రి వరుస క్రమంలో తమ అభీష్టాన్ని వ్యక్తం చేస్తున్న తీరు తెలంగాణా రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. మంత్రులు తమ భావాలను వ్యక్తీకరిస్తున్నారా? కోరికను వ్యక్తం చేస్తున్నారా? అంతర్గతంగా జరుగుతున్న ‘పట్టాభిషేకం’ ఏర్పాట్లను ముందే పసిగట్టి వ్యవహరిస్తున్నారా? ఇదీ అధికార పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. మరో వైపు మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన పరిస్థితుల్లో కేటీఆర్ మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ టాస్క్ లో భాగంగా పార్టీ కేడర్ కు దిశా, నిర్దేశం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

Comments are closed.

Exit mobile version