పొంగులేటి శ్రీనివాసరెడ్డి… తెలంగాణా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని స్థాయికి ఎదిగిన బడా కాంట్రాక్టర్-కమ్-రాజకీయ నేత. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ రాజకీయ పరిణామాల్లోనూ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందిన చరిత్ర. తాను విజయం సాధించడమేకాదు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఇదే జిల్లా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించి రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసిన నాయకుడు. అనంతర పరిణామల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా తొలి సీఎం కేసీఆర్ కు ప్రణమిల్లి అధికార పార్టీలో చేరారన్నది వేరే విషయం.

అయితే అధికార పార్టీ వర్గ రాజకీయాల్లో గత సాధారణ ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కని చేదు అనుభవాన్ని పొంగులేటి చవి చూశారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో పొంగులేటికి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసింది కూడా లేదు. కానీ అధికార పార్టీ తీర్థం పుచ్చుకుని సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ, మళ్లీ పోటీ చేసే అవకాశం ఆయనకు లభించకపోవడమే గమనార్హం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీల్లో పొంగులేటి కూడా ఉన్నారు. ఈ పరిణామాల్లో మహబూబ్ నగర్ నుంచి టికెట్ దక్కని జితేందర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పార్టీ నిర్ణయానికే కట్టుబడక తప్పదని స్థితి. కారణాలు ఏవైనప్పటికీ పొంగులేటి మాత్రం తనకు టికెట్ దక్కని ఆవేదనను లోలోనే దిగమింగారు. వేలాది మంది కార్యకర్తలు తన నివాసాన్ని చుట్టుముట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని పట్టుబట్టినప్పటికీ, పొంగులేటి సున్నితంగానే తిరస్కరించారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీ ఫారమ్ చేతుల్లో పట్టుకుని తన కోసం వేచి చూసిన పరిణామాల్లోనూ పొంగులేటి ఎటువైపునకూ మొగ్గు చూపలేదు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ పొంగులేటిని గత మార్చిలో చుట్టుముట్టిన అభిమానులు (ఫైల్ ఫొటో)

ఇదిగో ఈ పరిస్థితుల్లో పొంగులేటి ఆశించిన సమయం సమీపించినట్లు ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు పొంగులేటి అభిమానుల్లో, శ్రేయోభిలాషుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తెలంగాణాలోనూ రెండు ఉన్నాయి. గరికపాటి మోహన్ రావు, కేవీపీ రాంచందర్రావుల పదవీ కాలం పూర్తి కావచ్చింది. ఈ ఇద్దరూ ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కాకపోయినా, ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య ప్రామాణికంగా అధికార పార్టీకి ఆ రెండు సీట్లు ఏకగ్రీవంగా దక్కనున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోయినా, తమాయించుకున్న పొంగులేటి ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నారు. పార్టీ అధినేత ఆదేశాన్ని శిరసా వహించిన నేపథ్యంలో తనకు కేసీఆర్ న్యాయం చేస్తారనే విశ్వాసంతోనే శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

కానీ ఈ రెండు స్థానాల్లో ఒకటి తన కూతురు కవితకు కేసీఆర్ కట్టబెట్టే అవకాశాలున్నట్లు తాజా వార్తల సారాంశం. ఇక మిగిలింది మరో సీటు మాత్రమే. దీని కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మాజీ స్పీకర్లు కేఆర్ సురేష్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పై పొంగులేటి పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా? లేదా? అనే అంశంపై అధికార పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ అంశంలో కేసీఆర్ నిర్ణయం పొంగులేటిని పాల ముంచుతుందా? నీటి ముంచుతుందా? అనే ఉత్కంఠ ఆయన వర్గీయుల్లో ఏర్పడింది. ఫిబ్రవరి-మార్చిలోనే రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగింపునకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతుండగా, మున్సిపల్ ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ అంశం తేలితే తప్ప పొంగులేటి తన రాజకీయ భవితపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు.

Comments are closed.

Exit mobile version