తెలంగాణా పోలీసులు ఆపదలో చిక్కుకున్నారా? శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్ వన్ పోలీస్ గా పేరుగాంచిన తెలంగాణా పోలీసులకు కష్టం రావడం ఏమిటి? అధునాతన ఆయుధాలతో నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సత్తా గల తెలంగాణా పోలీసులకు ప్రస్తుతం ప్రజల మద్ధతు అవసరమైందా? పోలీసుల చర్యపై పూల వర్షం కురిపించినవారు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ దిగువన గల పోస్ట్ ను చదవండి.

*దిశ కేసులో మన పాత్ర ముగిసిందా!?*
* పోలీసులు కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా!??
* దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ కథ ముగిసింది.
* దిశ పై అత్యాచారం జరగగానే మనమంతా ఏం చేశాం? సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన పోస్టులు పెట్టాం.. పోలీసు స్టేషన్ల ఎదుట ధర్నాకు దిగాం. నిందితులను మాకు అప్పగిస్తారా? లేదంటే ఎన్కౌంటర్ చేస్తారా?? అని గగ్గోలు పెట్టాం.
* ఎన్కౌంటర్ కథ ముగిసింది. దిశ కేసులో నలుగురు నిందితులు హతమయ్యారు. మనం పోలీసులకు జేజేలు పలికాం.
* కానీ అంతటితో కథ మొత్తం ముగిసిపోలేదు. అసలు కథ ఇప్పుడు మొదలైంది..
* చాలామంది మానవత్వం పేరిట కోర్టులను ఆశ్రయించారు. జాతీయ మానవ హక్కుల సంఘం అంతటితో ఊరుకుంటుందా!? మన రాష్ట్రం రానే వచ్చింది.
* ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు, దిశ తల్లిదండ్రులు, నిందితుల తల్లిదండ్రులు, ఇతరుల అభిప్రాయాల పేరిట విచారణ జరిపింది. ఈ సమయంలో మనమేం చేయాలి? దిశ హత్య కేసులో నిందితులకు సరైన శిక్ష పడిందంటూ కనీసం ఇటు జాతీయ మానవ హక్కుల సంఘం వారికి, అటు కోర్టులకు తెలిసేలా మన వంతు పాత్ర పోషించలేక పోయాం.
* ఇప్పుడేమో పోలీసుల చుట్టూ నోటీసులు, కేసులు వెంట పడుతున్నాయి.
* ఈ సమయంలోనైనా మనం పోలీసులకు అండగా నిలవాల్సిన అవసరం లేదా?
* నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోతుంటే… ఎన్కౌంటర్ జరిగిన అంశాన్ని కూడా మనం పట్టించుకోకపోతే ఎలా???
* దిశ కేసులో నిందితులు చనిపోవడం తోనే కథ ముగిసినట్లు కాదు. మనమంతా ఇప్పుడు మన పోలీసులకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది..
* రండి… ఎవరికీ చేతనైన మార్గంలో వారు మద్దతు తెలుపుదాం… సామాజిక మాధ్యమాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేద్దాం…. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోలీసులకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మద్దతు ఉంది అని తెలిసేలా చేద్దాం.
* దిశ కేసులో పోలీసులు కేసుల పాలయితే… వారు ఇబ్బందుల్లో చిక్కుకుంటే… దిశ ఆత్మ క్షోభిస్తుంది.. ఈ సమయంలో మనమంతా పోలీసుల వెంట నిలిస్తేనే న్యాయం గెలిచినట్లు అవుతుంది..
*అందుకే..
సోదర సోదరీమణులారా… దయచేసి ఈ మెసేజ్ ను పెద్ద ఎత్తున షేర్ చేయండి.. దిశ కేసులో పోలీసులకు అండగా నిలవండి..

మెట్ పల్లిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు (అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి)

ఇదీ ఆ పోస్ట్ పూర్తి పాఠం. ఇదిగో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన నియోజకవర్గంలోని మెట్ పల్లిలో దిశ ఎన్కౌంటర్ నేపథ్యంలో భారీ ర్యాలీ ఒకటి నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులతో చేపట్టిన ఈ సంఘీభావ ర్యాలీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ, దిశ ఎన్కౌంటర్, అనంతరం పరిణామాలను సృశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ఆత్మ స్థయిర్యం దెబ్బతిన్ననాడు ప్రజలను రక్షించే మానవుడు లేడన్నారు. పోలీసులకు అన్యాయం జరిగిననాడు… ముందు నుంచి ఓ అమ్మాయిని దుండగులు తీసుకువెడుతున్నా, నిల్చుండి చూస్తారేగాని, ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. పోలీసులపై పూలవర్షం కురిపించినవారు, పోలీసులకు జరుగుతున్న అన్యాయంపై ఎవరూ మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.  మొన్న ఏదైతే చేశారో (ఎన్కౌంటర్?), అది కరెక్ట్ గానే తాము భావిస్తున్నామని, అట్ల జరిగిననాడె ఇటువంటి దుర్మార్గులకు శిక్షపడుతుందని, కనీసం ప్రజల్లో పరివర్తన వస్తుందన్నారు. అందరు ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా కోరుట్ల ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

విద్యార్థుల సంఘీభావ ర్యాలీలో కోరుట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కాసేపు పక్కనబెట్టి, అంతకు ముందు…అంటే దిశ నిందితుల ఎన్కౌంటర్ అనంతరం కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా పరిశీలిద్దాం. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, ‘మహిళలపై అకృత్యాలకు పాల్పడే గూండాలు, రౌడీలు తస్మాత్ జాగ్రత్త. అలాంటివారికి ఇలాంటి (ఎన్కౌంటర్) గతే పడుతుంది. దిశ ఘటనపై సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని పనిగట్టుకుని విమర్శించినవాళ్ల నోళ్లకు తాళం పడింది. సీఎం శాంతంగా, మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపం దాల్చుతారు. అది ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ చూస్తూ ఊర్కోరు.’ అని మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ‘ఎన్కౌంటర్ ఘటన చూసి నేను పోలీస్ ఆఫీసర్ ఎందుకు కాలేదన్నబాధ కలుగుతోంది. సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘నిందితుల ఎన్కౌంటర్ తో ‘దిశ’కు న్యాయం జరిగినట్లయింది. సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. సత్వర న్యాయం దిశగా వారం వ్యవధిలోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పారిపోతున్నవారిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు అభినందనలు’ అని మరో మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్కౌంటర్ ఘటన అనంతరం ఆయా మంత్రులు చేసిన వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఎన్కౌంటర్ ఉదంతంపై జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు విద్యార్థుల సంఘీభావ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసుల చర్యకు ‘ఉద్యమ’ నిర్వహణ తరహాలో మద్ధతు పలుకుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్వర న్యాయం, చట్టం, శిక్ష వంటి అంశాల నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యల సంకేతాలకు సంబంధించిన అంశంపై కూడా సహజంగానే చర్చ జరుగుతోంది.

‘న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపాన్ని సంతరించుకోకూడదు. అదే జరిగితే న్యాయం తన సహజ గుణాన్ని కోల్పోతుంది. తక్షణ న్యాయం అంటూ ఉండదు.’

‘మీరు తప్పు చేశారని మేం అనడం లేదు. కానీ దర్యాప్తులో లభిస్తున్న ప్రతి ఆధారం వెంటనే మీడియాకు ఎలా వెడుతోంది? అందుకే పారదర్శక విచారణ జరిపించాల్సిన అవసరముంది. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది.’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే వేర్వేరు సందర్భాల్లో చేసిన ఆయా వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి గమనార్హం.

Comments are closed.

Exit mobile version