పైన కనిపిస్తున్న దృశ్యం గుర్తుంది కదా? ఈనెల 13వ తేదీన తెలంగాణాకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా నలుగురు బీజీపీ ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పటి చిత్రం. ఈ సందర్భంగా తెలంగాణాలోని తాజా పరిస్థితులను ఎంపీలు ప్రధానికి వివరించారు. వీటిలో రాజకీయాలతోపాటు దిశ ఘటన నిందితుల ఎన్కౌంటర్ తదితర అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు 15 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని ఆరా తీసినట్లు ఢిల్లీ నుంచి వెలువడిన వార్తల సారాంశం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా ప్రధాని ఈ సందర్భంగా గట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంతకీ తెలంగాణా అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఆ పార్టీకి గల బలం ఎంత? అని టీఆర్ఎస్ నేతలు విషయాన్ని చాలా లైట్ గా తీసుకోవచ్చు…అది వేరే సంగతి. కానీ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనూహ్య రీతిలో నాలుగు లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ ప్రాతిపదికన 28 అసెంబ్లీ స్థానాల బలాన్ని బీజేపి కూడగట్టుకున్నట్లే భావించాల్సి ఉంటుంది. ఓ ఎంపీ గెలవడానికి అవసరమయ్యే కనీస ఆధిక్యతను ప్రామాణికంగా తీసుకున్నా, ప్రతి లోక్ సభ స్థానంలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల చొప్పున, తక్కువలో తక్కువగా 16 అసెంబ్లీ స్థానాల వరకు బేజేపీ బలం పెరిగినట్లే.

ఎన్నికలు, విశ్లేషణలు తదితర అంశాలను కాసేపు వదిలేద్దాం. ఈనెల 13వ తేదీన ప్రధాని చెప్పిన ప్రధాన అంశం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని. ఇదిగో ప్రధాని నోటి నుంచి ఆ మాట వెలువడిన నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు సంబంధించి రెండు ఘటనలు చోటు చేసుకోవడం విశేషం. బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది గంటల తేడాతోనే చోటు చేసుకున్నఈ పరిణామాలపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నమస్తే తెలంగాణా వార్తా కథనం క్లిప్పింగ్

పసుపు బోర్డు అంశంలో స్టాంపు పేపర్ పై హామీ ఇచ్చి సంతకం చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట తప్పారని, అందువల్ల ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు కొందరు రోడ్డెక్కారు. అర్వింద్ దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు, నిరసనలు వంటి అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ పత్రిక పుంఖాను పుంఖాలుగా వార్తా కథనాలను కూడా అందిస్తోంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్డెక్కి చలిలోనే వణికిపోతూ గగ్గోలు పెట్టినప్పటికీ, ఏమాత్రం పట్టించుకోని కొన్ని మీడియా సంస్థలు అర్వింద్ విషయంలో మాత్రం పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని భారీ ఎత్తున వార్తలు వండి వారుస్తుండడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో ఆయా ఘటనలు ఊపందుకున్న రోజే కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం యాధృచ్ఛికమే కావచ్చు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, గంగుల కమలాకర్ పై కుట్ర జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ బదిలీ జరగడం గమనార్హం.

నమస్తే తెలంగాణా వార్తా కథనం క్లిప్పింగ్

వాస్తవానికి అటు నిజామాబాద్, ఇటు కరీంగనర్ ఎంపీలుగా అర్వింద్, సంజయ్ ల గెలుపు అధికార టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కు ఏ మాత్రం మింగుడు పడని అంశంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తుంటారు. సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అర్వింద్, ముఖ్యమంత్రి కుడి భుజంగా ప్రాచుర్యం పొందిన బోయినపల్లి వినోద్ కుమార్ ను సంజయ్ ఓటమి బాట పట్టించడం ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే అర్వింద్ రాజీనామాకు పట్టుబడుతూ పసుపు రైతులు ఉద్యమించడానికి దారి తీసిన పరిస్థితులపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్వింద్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న రైతులు కేసీఆర్ పాలన తీరును ఓ అద్భుతంగా కీర్తించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. అదే విధంగా ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఓ కార్మికుని మృతి ఘటన సందర్భంగా సంజయ్, పోలీసుల మధ్య జరిగిన వివాదం, అనంతరం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తో ఫోన్ సంభాషణ ఆడియో లీక్ వ్యవహారం వరకు జరిగిన పరిణామాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్ ఎంపీల విషయంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కాకతాళీయమే కావచ్చు, కానీ రాజకీయ కోణంలో మాత్రం ఎన్నో సందేహాలు… మరెన్నో భిన్నాభిప్రాయాలు. అదికారంలోకి వస్తామనే బీజేపీ నేతల ధీమాను నిలువరించే ప్రక్రియ కూడా ఇందులో ఉండి ఉండవచ్చనే వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇటువంటి అనేక ప్రతిబంధక పరిణామాలను బీజేపీ నాయకత్వం ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.

Comments are closed.

Exit mobile version