గత జీవితమంతా తాడిత, పీడిత ప్రజల కోసం సాయుధ పోరాటం. తుపాకీ చేబూని అడవుల్లో తిరుగుతూ పోలీసులతో పోరాడిన నేపథ్యం. చేతిలోని తుపాకీని సవరించి, ట్రిగ్గర్ నొక్కి పోలీసులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన ఘటనలు అనేకం. అనేక ఎన్కౌంటర్ ఉదంతాల్లో చాకచక్యంగా తప్పించుకున్న అజ్ఞాత జీవితం. సమ సమాజ స్థాపనే లక్ష్యంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే విశ్వాసం. అన్యాయాలకు, అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర. ఓ అడబిడ్డకు అన్యాయం చేశాడనే అభియోగం, నిర్ధారణపై ఓ మృగాడి వృషణాలు కోసి శిక్ష విధించినట్లు జరిగిన ప్రచారం.

మారిన పరిణామాల్లో దాదాపు 20 ఏళ్ల క్రితమే ఆమె అజ్ఞాత జీవితమూ సరికొత్త మార్గంలో పయనించింది. జనజీవన స్రవంతిలో కలిసిన ఆమె ప్రస్తుతం చట్టసభకు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకురాలు. ఆమె పేరు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. ఇంతకీ విషయమేమిటి? ఆమె మాజీ నక్సలైట్ లీడరనే విషయం అందరికీ తెలిసిందే కదా అంటారా? అక్కడే ఉంది తాజా విషయం. అజ్ఞాత జీవితంలో తుపాకీ చేతబట్టి పోలీసులతో పోరాడిన సీతక్క ప్రస్తుతం అదే పోలీసు శాఖకు చెందిన అనేక మంది అధికారులను సత్కరిస్తుండడమే అసలు విశేషం. అందువల్లే ఈ అంశం వార్తా కథనంగా మారింది.

ఇటీవల ముగిసిన మేడారం జాతరను విజయవంతం చేయడంలో తీవ్రంగా శ్రమించిన అనేక మందిని అధికారులను ములుగు ఎమ్మెల్యే సీతక్క మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. వారిని శాలువాతో సత్కరించి మెమంటోను బహుకరిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ లతోపాటు ఆర్డీవో వంటి రెవెన్యూ అధికారులను కూడా సీతక్క సత్కరిస్తున్నారు. గడచిన పది రోజులుగా ఆమె ఈ సత్కారపు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మేడారం జాతర ప్రాంతం గల ములుగు నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క నుంచి సత్కారాలు అందుకున్న వారిలో పోలీసు శాఖకు చెందిన అధికారులు కూడా ఉండడమే అసలు విశేషం. ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఓఎస్డీ సురేష్ కుమార్, ఏఎస్పీలు సాయి చైతన్య, శరత్ చంద్ర వంటి ఐపీఎస్ అధికారులే కాదు, నియోజకవర్గం వ్యాప్తంగా శాంతిభద్రతల విధుల్లో గల సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులను సైతం సీతక్క దశలవారీగా సత్కరిస్తున్నారు.

పీడిత జనం కోసం తుపాకీ చేబూని పోలీసులతో పోరాటం చేసిన చేతులే శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న అధికారులను ప్రస్తుతం సత్కరిస్తున్న దృశ్యాలు అత్యంత ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మానవ జీవన పరిణామ క్రమంలో జనజీవన స్రవంతిలో కలిసిన ‘మారిన మనిషి’లోని మాజీ నక్సల్ లీడర్ సీతక్క ఇప్పటికీ పీడిత ప్రజలను లక్ష్యంగానే చేసుకుని తన రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తుండడం గమనార్హం. గిరిజన గూడేల్లో మూతపడిన 20 బడులను ఆదివాసీ పిల్లల చదువు కోసం తన పేరున గల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించి నిర్వహిస్తుండడం ఇందుకు నిదర్శనం. సీతక్క వివిధ స్థాయి పోలీసు అధికారులను సత్కరించిన దృశ్యాలను దిగువన స్లైడ్ షోలో తిలకించవచ్చు.

1 / 9

Comments are closed.

Exit mobile version