దాదాపు పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ లో స్థిరపడ్డ వరంగల్ నగర శివారు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఒకరు దేవన్నపేటకు చెందిన ఓ వృద్ధ రైతు కుటుంబం నుంచి రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ భూమి విలువ మహా అయితే ఓ రెండు లక్షలు కావచ్చు. ఈ వ్యాపారవేత్త తన పని తాను చేసుకుంటున్న నేపథ్యంలోనే కొందరు రియల్టర్ల కన్ను ఆయా భూమిపై పడింది. కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో సదరు భూ రికార్డులను పరిశీలించారు. ‘అనుభవదారు కాలమ్’లో భూ విక్రయదారుల పేరే కొనసాగుతుండడాన్ని గమనించిన రియల్టర్లు తమ పథకాన్ని అమలు పరిచే దిశగా పావులు కదిపారు. భూమిని అమ్మిన వృద్ధ దంపతులను ప్రలోభాలకు గురిచేసి వారిని ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి భూమి తమదేనంటూ ఫిర్యాదు చేయించారు. ఈ తతంగానికి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి చేయూత కూడా లభించింది.

ఇంకేముంది రియల్టర్లు రెచ్చిపోయారు. వ్యాపారవేత్త కొనుగోలు చేసిన భూమిలో డోజర్ తో చదును చేయడం ప్రారంభించారు. తన భూమిని కొందరు రియల్టర్లు డోజర్ తో చదును చేస్తున్నట్లు తెలుసుకున్న వ్యాపారవేత్త నివ్వెరపోయారు. తీవ్ర ఆందోళనతో మొత్తం విషయాన్ని తన క్లాస్ మేట్ అయిన వరంగల్ నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. తన భూమిని ఎలా కబ్జా చేస్తున్నారో పూసగుచ్చినట్లు వివరించారు. కేసు పూర్వాపరాలను లోతుగా స్టడీ చేసీన సీపీ దిగువస్థాయి పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. విచారణలో ఏమాత్రం తేడా వచ్చినా అందరి మీదా కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. దీంతో భూ కబ్జాకు యత్నించిన రియల్టర్లు, వారికి మద్ధతునిచ్చిన ప్రజాప్రతినిధి తోక ముడిచారు. భూమిని కొనుగోలు చేసిన వ్యాపారవేత్త ప్రస్తుతం దాని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించుకుని, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ కు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ ఘటనలో బాధితుడు కమిషనర్ స్థాయి పోలీసు అధికారికి క్లాస్ మేట్ కాబట్టి తన భూమిని తాను దక్కించుకోగలిగారు. లేకుంటే ప్రస్తుతం దాదాపు రూ. 6.00 కోట్ల విలువైన ఆయా భూమిని రియల్టర్లు గద్దల్లా తన్నుకుపోయేవారు. ఇందులో ఏ సందేహమూ లేదన్నది ఉదంతం గురించి తెలిసినవారి వాదన. ఆ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వరంగల్ నగరంలో తీవ్ర కలకలం కలిగించింది. గ్రేటర్ వరంగల్ నగరం చుట్టూ శర వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ‘రింగ్ రోడ్డు’ ప్రభావం వల్ల భూముల విలువతోపాటు కబ్జాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు కూడా పెరిగాయని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ మాత్రమే. ఇవి చాలవన్నట్లు తాజాగా మావోయిస్టు లేఖలు పుట్టుకురావడానికి కూడా  రింగ్ రోడ్డు చుట్టూ గల భూములకు పెరిగిన ధరలే ప్రధాన కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్ వరంగల్-హైదరాబాద్ మార్గంలోని కరుణాపురం నుంచి ఏటూరునాగారం-జగదల్ పూర్ జాతీయ రహదారిని కలుపుతూ దాదాపుగా పూర్తయిన రింగ్ రోడ్డు దాని చుట్టూ గల భూముల ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరుణాపురం, పెద్దపెండ్యాల, రాంపూర్, టేకులగూడెం, ఉనికిచెర్ల, దేవన్నపేట, చింతగట్టు, పలివేల్పుల, పెగడపల్లి, గుంటూరుపల్లి తదితర ప్రాంతాల్లో రింగు రోడ్డు పుణ్యమా అని భూముల ధరలు నింగినంటాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ముందు ఎకరానికి పది లక్షలు కూడా పలకని భూములు ప్రస్తుతం కనిష్టంగా రూ. 2.00 కోట్లు, గరిష్టంగా రూ. 3.00 కోట్లు ధర పలుకుతుండడం గమనార్హం. తాజాగా ఐటీ కంపెనీల స్థాపనతో మున్ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫలితంగా కొందరు రియల్టర్ల దాష్టీకాలతో భూ వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. రియల్టర్ల లిటిగేషన్ వ్యవహారాలకు అధికారిక మద్ధతు లభిస్తోందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలను హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టుల పేరుతో లేఖలు విడుదలైన విషయం విదితమే. ఈ లేఖల హెచ్చరికల, ఆరోపణల సారాంశం భూ వివాదాలు, ‘రియల్ ఎస్టేట్’ దందా చుట్టూ పరిభ్రమించడం విశేషం. ఈ లేఖల ‘ఒరిజినాలిటీ’ అంశంలో ఇప్పటికే రకరకాల వాదనలు, వ్యాఖ్యలు ఉనాయన్నది వేరే విషయం. కానీ వరంగల్ మహానగరం చుట్టూ నిర్మితమవుతున్న రింగ్ రోడ్డును అనుకుని ఉన్న గ్రామాలకు సంబంధించిన భూ సంబంధిత అంశాలపైనే నక్సల్స్ లేఖలు విడుదల కావడాన్ని పోలీసు నిఘా వర్గాలు సైతం లోతుగానే అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ రింగు రోడ్డు సోయగాలను దిగువన స్లైడ్ షోలో చూడండి.

1 / 9

Comments are closed.

Exit mobile version