విప్లవోద్యమ భావాలు గల వ్యక్తులు ఆవేశపడుతుంటారు..అన్యాయం జరిగిందని భావించినపుడు ప్రశ్నిస్తుంటారు. నీ సంగతేమిటని నిలదీస్తుంటారు. అలాగని విప్లవ భావాలు గల వ్యక్తులందరికీ ఒకే తరహా మనస్తత్వం ఉండదు. ‘ఎరుపు’ భావాలు గల వారిలో అనేక మంది శాంతి స్వభావులుగానే కనిపిస్తుంటారు. అవకాశం వచ్చినపుడు మాత్రం ‘వర్గ శతృవు’ దిమ్మ తిరిగేలా, మళ్లీ కోలుకోలేని విధంగా ఒకే ఒక వేటు వేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే వర్గ శతృ నిర్మూలన విప్లవోద్యమంలో ఓ భాగం. వర్గ శతృవు బలంగా ఉన్నపుడు ఓ అడుకు వెనక్కి వేసి, రెండడుగులు ముందుకు నడవడం విప్లవోద్యమ ‘సేఫ్’ సూక్తి. వర్గ శతృవు బలంగా ఉన్నపుడు కూడా మొండిగా ముందుకు వెడితే విప్లవోద్యమానికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందనే విషయం అనేక సంఘటనల్లో రుజువైంది కూడా. విప్లవోద్యమంలో గల వ్యక్తులూ మనుషులే. వారికీ భావోద్వేగాలు ఉంటాయి.

ఇక్కడ అసలు విషయం విప్లవం, ఉద్యమం గురించి కాదు. విప్లవోద్యమం నుంచి వచ్చినవారి భావోద్వేగాల గురించే. మంత్రి ఈటెల రాజేందర్ వ్యక్తీకరిస్తున్న ఉద్వేగం గురించే. ఆయన విప్లవోద్యమం నుంచే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అడుగిడి రాజకీయ నాయకుడిగా మారారు. 1983-85 ఎన్నికల్లో న్యూడెమక్రసీ పార్టీ తరపున ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుమ్మడి నర్సయ్య గెలుపు కోసం ప్రచారంలోనూ పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ పార్టీ అనుంబంధమైన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) లో పనిచేశారు. విప్లవం, ఉద్యమం గురించి అనేక అంశాలను ఒంటబట్టించుకున్న ఈటెల రాజేందర్ కు వాటి అసలు స్వరూపం, నిర్వచనం గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

కానీ ఈటెల ఈ మధ్య తరచూ ఆవేశపడుతున్నారు. ఓ రకంగా ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఆక్రోశిస్తున్న భావన. అదే పనిగా అంతర్మథనమేమీ చెందడం లేదు. బాహాటంగానే ‘బరస్ట్’ అవుతున్నారు. ‘కొడకా…మేం కిరాయిదార్లం కాదు. గులాబీ జెండా ఓనర్లం’ అంటూ ఆ మధ్య హుజురాబాద్ సభలో ఈటెల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర కలకలం కలిగించాయి. రాజేంద్రన్న కూడా తనలాగే మనసులో ఏదీ దాచుకోలేడని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా శ్రుతి కలిపారు. తాను కూడా గులాబీ జెండాకు ఓనర్ నేనని మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి శివాలెత్తారు. ఆ తర్వాత పరిణామాల్లో ‘ఓనర్ల’ వ్యాఖ్యలు సద్దుమణిగాయి.

కానీ మంత్రి ఈటెల మళ్లీ భావోద్వేగానికి గురయ్యారు. హుజూరాబాద్ మండలం శాలపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి మరోసారి ‘ఈటె’ల్లాంటి మాటలు విసిరారు. తనకు వెన్నుపోటు పొడిచెందవరో తెలుసంటున్నారు. ద్రోహం చేసినవారికి భవిష్యత్ లో సమాధానం చెబుతానని ప్రకటించారు. అంతిమ విజయం ధర్మం, సత్యం, న్యాయానిదేనని పునరుద్ఘాటించారు. తన పదవి ప్రజల భిక్ష మాత్రమేనని మళ్లీ స్పష్టం చేశారు. మంచి పనులకే తప్ప, మద్యం బాటిళ్లకు ఓట్లు పడవని నర్మగర్భపు వ్యాఖ్య చేశారు. క్యాంపు రాజకీయాలు తనవల్ల కాదని, ధర్మంగా కొట్లాడటమే తనకు తెలుసన్నారు. కొందరు నాయకులు గెలుపునకు ముందు, గెల్చిన తర్వాత పరస్పర భిన్నంగా ఉంటారని ఎవరినో వేలెత్తి చూపారు. ఇదిగో ఇలా సాగింది ఈటెల రాజేందర్ తాజా భావావేశపు ప్రసంగం.

సరే, రాజకీయాలంటేనే దొంగదెబ్బ, వెన్నుపోట్లు, ద్రోహం వంటి అనేక అంశాల కంపుగా పలు ఘటనల్లో తేటతెల్లమైంది. పద్దెనిమిదేళ్ల రాజకీయానుభవం గల ఈటెల రాజేందర్ కు ఈ విషయలేవీ తెలియనివి కూడా కావు. కానీ పదే..పదే మంత్రి రాజేందర్ ఎందుకు ఆవేశపడుతున్నారు? మరెందుకు ఆయన ఆవేదన చెందుతున్నారు? ‘అయితే హైదరాబాద్..లేదంటే హుజురాబాద్ మంత్రి’ అనే ప్రచారం జరుగుతున్నందుకా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లో తన చుట్టూ నమ్మకస్తులైన వారు లేని పరిస్థితి ఏర్పడిందా?  ఇరుగు, పొరుగున ఆధిపత్య పోరు తీవ్రతరమవుతోందా? నాలుగు రోజుల క్రితమే కదా? సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటన సందర్భంగా ఈటెల రాజేందర్ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఇచ్చారు. శామీర్ పేట ఔంటర్ రింగ్ రోడ్ జంక్షన్ సమీపంలోనే నివాసముండే ఈటెల రాజేందర్ సహా ఆయన కుటుంబాన్ని తాను ప్రయాణిస్తున్న బస్సులో కేసీఆర్ ఎక్కించుకున్నారు. మరెందుకు ఈటెల రాజేందర్ మథనపడుతున్నారు. తరచూ ఎందుకిలా భావోద్వేగం చెందుతున్నారు? అంతర్గతంగా ఏవేని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఇవీ.. ఇప్పుడు అధికార పార్టీ కేడర్ లో వ్యక్తమవుతున్న సందేహాలు. మంత్రి ‘ఈటె’ల్లాంటి మాటల, వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందేమో! చూడాలి.

Comments are closed.

Exit mobile version