‘జెర గట్లనే ‘పీకలు’ కూడా పెట్టకుండా ఉండాలని పోలీసోళ్లకు కూడా సెప్పమనరాదుర్రి పెద్ద సారును’ అంటూ డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ మిత్రుడు పంపిన వాట్సాప్ మెసేజ్ సారాంశమిది. ‘అబ్కారోళ్లకూ సదివిచ్చి, పోలీసులకూ సదివిచ్చుడు ఏంది సారూ?’ అంటూ దానికి కొనసాగింపు. ఎవరికో ఒకరికి ‘రకం’ కడితే సరిపోదా? అని ప్రశ్న కూడా వేశారు ఆ మిత్రుడు. డిసెంబర్ 31తోపాటు జనవరి 1వ తేదీ సంబరాలు కూడా ముగిసిన నేపథ్యంలో ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే…

కేవలం రెండ్రోజుల వ్యవధిలో (డిసెంబర్ 30, 31 తేదీలు) అక్షరాలా రూ. 400 కోట్లకు పైగా విలువైన మద్యం మంచినీళ్ల ప్రాయంలా సేవించినట్లు ఎక్సైజ్ శాఖ వారు లెక్కలు తేల్చారు. డిసెంబర్ చివరి వారం మొత్తం రూ. 600 కోట్ల విలువైన మద్యం తాగినట్లు గణాంక వివరాలు వెల్లడిస్తుండగా, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ. 400 కోట్ల విలువైన లిక్కర్ సేవించారంటే మామూలు విషయమేమీ కాదు మరి. ఇందులో సింహభాగం అంటే నాలుగో వంతు రూ. 100 కోట్ల విలువైన మద్యాన్ని భాగ్యనగర వాసులు గుటుక్కుమనిపించారన్నది ఎక్సైజ్ శాఖ తేల్చిన లెక్క.

సరే తాగాక ఊరకనే ఉండరు కదా..తాగుబోతులు. తాగి, తందనాలాడిన తర్వాత అనేక మంది ఊగుతూ, తూలుతూ, వాహనాలు నడుపుకుంటూ రోడ్లపైకి వచ్చి పోలీసులకు చిక్కారు. బార్లకు అర్థరాత్రి దాటాక ఒంటి గంట వరకు, వైన్ షాపులకు అదనగా మరో రెండు గంటలపాటు మందు విక్రయాలకు సర్కారు వారే సడలింపు ఇచ్చాక.. మందుబాబులు తాగరా? తాగినాక ఊగరా? అంటూ సదరు ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తం చేస్తున్న సందేహం సహేతుకమే కదూ! ఇదిగో ఇలా తాగి వాహనాలు నడుపుతూ రోడ్ల మీదకు వచ్చిన 3,148 మంది డ్రంకెన్ డ్రైవింగ్ లో పోలీసులకు చిక్కారు. ఇందులో ఓ మహిళామణి కూడా ఉందండోయ్.. తెలంగాణా వ్యాప్తంగా 33 జిల్లాల్లో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి జాబితాను పోలీసు శాఖ విడుదల చేసింది.

Comments are closed.

Exit mobile version