మేడారంలో అక్షరాలా రూ. 75 కోట్ల విలువైన జాతర సౌకర్యాల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే కదా? సరే ప్రభుత్వం అన్నాక పాలనా సౌలభ్యం కోసం ఏ అధికారినైనా, ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. అది పాలకుల ఇష్టం. ప్రజా ప్రయోజనమో, పాలక ప్రయోజనమో..ఏదైనా కావచ్చు.. పరిపాలనలో భాగంగా అధికారులు అటూ, ఇటూ మారుతుంటారు. కానీ కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరయ్యే గిరిజన పండుగ, ఆసియాలోనే అతిపెద్ద జాతరకు ‘ట్రస్టు’ బోర్డు నియామకం అంశంలో తెలంగాణా ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ పద్ధతిని అనుసరించిన వైఖరిపైనే ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరో 35 రోజుల్లో మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రస్టు బోర్డు ఊసు లేకుండా, చైర్మెన్ సహా 15 మంది సభ్యులతో ‘పునరుద్ధరణ’ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. సరే.. ఇందులో గిరిజనులు, గిరిజనేతరులు అనే వివాదాలను కాసేపు వదిలేద్దాం. వద్దిరాజు రవిచంద్ర అనే ప్రముఖ దాతను మినహాయిస్తే మిగతా వారిలో ఎంత మంది దాతలున్నారు? వారు తమకు నిర్దేశించిన ‘పునరుద్దరణ’ కర్తవ్యాన్ని నిర్వర్తించగలరా? అనే సందేహాలను కూడా కాసేపు పక్కన పెడదాం. అసలు మేడారం జాతర ట్రస్టు బోర్టుకు అనాదిగా ఓ చరిత్ర ఉంది. అందుకు విరుద్ధంగా గడచిన కొన్నేళ్లుగా పాలకులు వ్యవహరిస్తుండడమే ప్రస్తుతం చర్చకు తావు కల్పిస్తోంది.

ఫైల్ ఫొటో

వాస్తవానికి మేడారం జాతర ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలను కొలిచే ఉత్సవం. రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి గిరిజనులు దశాబ్ధాల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. ట్రస్టు బోర్డు నియామకాలకు సంబంధించి కూడా గతంలో అనేక వివాదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గిరిజన జాతరకు 1970 దశకం నుంచి 1980 దశకం వరకు సంతోష్ చక్రవర్తి అనే ములుగు ఎమ్మెల్యే నుంచి మలహల్రావు, భవర్ లాల్ లాహోటీ, కొమరగిరి కోదండం, నూతక్కి నాగేశ్వర్రావు వంటి గిరిజనేతరులు సైతం మేటారం ట్రస్టు బోర్డు చైర్మెన్లుగా వ్యవహరించారు. అయితే ఈ అంశంలో ఆదివాసీలు ఆందోళనకు దిగడంతో పాలకులు ఎట్టకేలకు చైర్మన్లుగా గిరిజనులనే నియమిస్తున్నారు. గతంలో రెండేళ్ల పదవీ కాలం…అంటే జాతర జరిగే ఆనవాయితీ వ్యవధి వరకు ట్రస్టు బోర్డు ఫోర్స్ లో ఉండేది.

కానీ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం ఈ పదవీ కాలం ఏడాదికి కుదించారు. వాస్తవానికి రెండేళ్లకోసారి మహా జాతర జరుగుతుంటుంది. కానీ ట్రస్టు బోర్డు పదవీ కాలం ఏడాదికే కుదించడమనే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు 2014లో వచ్చిన జాతర నుంచి మేడారం జాతరకు సంబంధించి ‘పునరుద్ధరణ’ కమిటీ నియామకం జరుగుతుండడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే 2016 జాతరలోనూ పునరుద్ధరణ కమిటీ బాటనే అనుసరించారు. ప్రస్తుత జాతరకు కూడా పునరుద్ధరణ కమిటీనే నియమించడం విశేషం.

వన దేవతలను తీసుకువస్తున్న చిత్రం (ఫైల్)

మేడారం జాతరకు సంబంధించిన ట్రస్టు బోర్డు నియామకం అంశంలో ప్రభుత్వాలు ప్రతిసారి తాత్సారం చేస్తూ, చివరకు అంటే జాతర పూర్తిగా సమీపించిన తరుణంలో పునరుద్ధరణ కమిటీలను ఏర్పాటు చేయడం వెనుక కారణాలు ఏవైనా ఉండవచ్చు. కానీ ఈ పునరుద్ధరణ కమిటీల వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటన్నదే అసలు ప్రశ్న. వాస్తవానికి పునరుద్ధరణ కమిటీలకు ఎటువంటి అధికారాలు ఉండవు. కమిటీలోని చైర్మెన్ సహా సభ్యులందరూ ఉత్సవ విగ్రహాల పాత్రనే పోషించాల్సి ఉంటుంది. దేవాదాయశాఖ పరిభాషలో చెప్పాలంటే ఇది ఉత్సవ కమిటీ మాత్రమే. గతంలో ఫెస్టివల్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన ఉదంతాలు ఉండగా, గిరిజనులు ఫెస్టివల్ కమిటీల నియామకపు చట్టబద్ధతనే ప్రశ్నించారు. దీంతో పాలకులు మళ్లీ ఫెస్టివల్ కమిటీల జోలికి వెళ్లలేదు. కానీ ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేయకపోవడమే అనేక సందేహాలను కలిగిస్తోందని భక్తజనం అభిప్రాయపడుతోంది.

మేడారంలో జరిగే ప్రతి అభివృద్ధి పని నిర్వహణ, దాని నాణ్యత వంటి అంశాలను నిశితంగా పరిశీలించి ప్రశ్నించే హక్కు ట్రస్టు బోర్డుకు ఉంటుంది. పనిలో ఎక్కడ నాణ్యత లోపించినా అడ్డుకునే అధికారం కూడా ఉంటుంది. కానీ పునరుద్ధరణ కమిటీలకు ఎటువంటి అధికారాలు ఉండవు. ఈ కమిటీలు కేవలం ఆలయం పరిధికి మాత్రమే పరిమితం కావలసి ఉంటుంది. మేడారంలో ఆలయం ఉండదు కాబట్టి, అమ్మవార్లను కొలిచే గద్దెల ప్రాంగణం వరకు మాత్రమే పునరుద్ధరణ కమిటీ పరిమితం కావలసి ఉంటుంది. దాతల నుంచి నిధులు సమీకరించి సంబంధిత ఆలయ/గద్దెల ప్రాంగణం అభివద్ధికి మాత్రమే పునరుద్ధరణ కమిటీ పాటు పడాల్సి ఉంటుంది. ఇందుకు విరాళాలను సేకరించడమే ప్రధాన విధిగా పునరుద్ధరణ కమిటీలకు ఉంటుంది. అంతే తప్ప…జాతర తర్వాత జంపన్నవాగులో నిర్మించిన స్నాన ఘట్టాలు కొట్టుకుపోయినా, మేడారంలో నిర్మిస్తున్న శాశ్వత షెడ్లు గాలివాటానికి కూలిపోయినా ప్రశ్నించే హక్కు పునరుద్ధరణ కమిటీకి ఏ మాత్రం ఉండదు. ట్రస్టు బోర్డు నియామకానికి ముందుగానే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను ఆహ్వానించడం, నిర్ణీత గడువులోపు ట్రస్టు బోర్డును నియమించడం వంటి ప్రక్రియకు ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. కేవలం నిర్ణీత గడువు వరకు మాత్రమే పునరుద్ధరణ కమిటీలు పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన పునరుద్ధరణ కమిటీ కాలపరిమితి కేవలం మూడు నెలలు. అంటే మార్చి నెలాఖరు తర్వాత మేడారంలో రూ. 75 కోట్ల పనుల్లో ఏవేని అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రశ్నించేవారే ఉండరన్న మాట.

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, బీజేపీ నాయకులకు పట్టింపు లేదని విమర్శలు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త ట్రస్టు బోర్డు గురించి కూడా పట్టించుకోవలసిన అవసరం ఉందనిపిస్తోంది కదూ!

Comments are closed.

Exit mobile version