అమరావతి రాజధాని ప్రాంతంలో డబ్బులు ఎక్కువై మహిళలు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అవుననే అంటున్నారు ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. ఇటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదనే తరహాలో పద్మశ్రీ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అంతేకాదు ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘చెప్పు తెగుతుంది…అంటూ… చెప్పు చూపిస్తూ పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

చెప్పు చూపుతూ మాట్లాడుతున్న పద్మశ్రీ

పూర్తి వివరాల్లోకి వెడితే..తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో పర్యటించిన పద్మశ్రీ తుళ్లూరు బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధానిలో నివసిస్తున్న మహిళలు డబ్బులు ఎక్కువై, ఇళ్లల్లో పేకాట స్థావరాలు నడిపిస్తున్నారని, వాటిని సీఎం జగన్ మూయించడంతోనే .. రోడ్లపైకి వచ్చారంటూ వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆమె చెప్పు చూపిస్తూ.. ‘‘చెప్పు తెగుతుంది జగన్మోహన్ రెడ్డి.. ఏం చేసుకుంటావో చేసుకో.. ఎన్నికేసులు పెట్టుకుంటావో పెట్టుకో భయంలేదు.. తెలుగింటి ఆడపడుచులపైన, మహిళలపైన.. తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు. పద్మశ్రీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments are closed.

Exit mobile version