మళ్లీ విక్టిమ్ బ్లేమింగ్, మళ్లీ, మళ్లీ అదే బ్లేమింగ్. కొందరు మంత్రుల వంతు ముగిసింది, సీన్లోకి కామరెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ శోభ ఎంటరయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంలో తెలంగాణా మంత్రులు కొందరు చేసిన వ్యాఖ్యల దుమారం ‘నిందితుల’ ఎన్కౌంటర్ పరిణామాల తర్వాత సద్దుమణిగిన సంగతి తెలిసిందే కదా? హత్యోదంతానికి ముందు దిశ తన సోదరికి బదులు 100కు డయల్ చేస్తే బాగుండేదని హోం మంత్రి మహమూద్ ఆలీ, ‘ఇంటికో పోలీస్ ను పెట్టలేం కదా?’ అని మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతీ తెలిసిందే.

సరే వరుస పరిణామాల్లో దిశను దారుణంగా హత్య చేసిన నిందితులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు కూడా. ఈ సంఘటనకు సంబంధించి ఇటు హైకోర్టులో, అటు దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలై కేసుల విచారణ కూడా ప్రారంభమైంది. మరోవైపు మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సైతం విచారణ జరిపి ఢిల్లీకి వెళ్లారు. ఎన్కౌంటర్ ఉదంతంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇదిగో ఈ పరిస్థితుల్లోనే కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ శోభ దిశపైనా, ఆమె తల్లిదండ్రులపైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం సాక్షిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిశకు తన తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో అనిపిస్తోందని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిందితులు తనను అడ్డుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేకే దిశ తన చెల్లెలికి ఫోన్ చేసిందని వ్యాఖ్యానించారు. ఆమె చెల్లికి బదులు తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకువెళ్లేవారని శోభ అన్నారు. గెజిటెడ్ ఆఫీసరైన దిశకు ఎవరికి ఫోన్ చేయాలో తెలీదా? ఆమె భయపడటం ఏంటి? అని శోభ ప్రశ్నించారు. పేరెంట్స్ దగ్గర ఆమె ధైర్యం కోల్పోయిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ధైర్యంగా ఉండటం తల్లిదండ్రులు నేర్పాలి, పిల్లలను ప్రేమించడం నేర్పాలని ఆమె హితవు చెబుతూ,‘ఇలాంటి సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. ప్రభుత్వం ఆపాలంటే ఎక్కడ ఆపుతుంది? ప్రతి ఒక్కర్ని ఎక్కడ జాగ్రత్తగా చూస్తారు?’ అని కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ శోభ వ్యాఖ్యానించారు. శోభ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అక్కా, శోభక్కా…? దిశ ఘటనలో మీరు కాస్త ఆలస్యంగా మేల్కొన్నట్టున్నారు. నిందితుల ఎన్కౌంటర్ ఘటనతో దిశ ఆత్మ శాంతించి ఉంటుంది. కానీ మీ వ్యాఖ్యల అనంతరం ఆమె ఆత్మ మళ్లీ ఘోషిస్తుంది తల్లీ’ అంటున్నారు కొందరు నెటిజన్లు.

Comments are closed.

Exit mobile version