కరోనా వైరస్ పేరు చెబితేనే మనం గజ గజ వణికిపోతున్నాం కదా? ప్రపంచ దేశాల పరిస్థితి కూడా అదేననుకోండి. కానీ తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వైరస్ సోకిన ‘పాజిటివ్’ పేషెంట్ వద్దకు నేరుగా వెళ్లి పరిస్థితులను పరిశీలించి, పర్యవేక్షించడమే విశేషం. తామున్నామని పేషెంటుకు భరోసా కల్పించడం ప్రత్యేకాంశం. కరోనా వైరస్ పై జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో పేషెంట్ వద్దకు మంత్రి వెళ్లడం సహజంగానే చర్చనీయాంశమైంది.
ఇందులో భాగంగానే కరోనా వైరస్ పాజిటివ్ గా నమోదైన 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దగ్గరకు మంత్రి ఈటెల స్వయంగా వెళ్లడం గమనార్హం. ఆయనతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో భయపడవద్దని, ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుందని, పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటికి తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను, భయాలను తొలగించడానికే తాను గాంధీ ఆసుపత్రిలో స్వయంగా పర్యటిస్తున్నట్లు మంత్రి ఈటల ఈ సందర్భంగా తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోని పలు ప్రాంతాల్లో మంత్రి ఈటెల పర్యటించిన వీడియోను దిగువన చూడవచ్చు.