Facebook X (Twitter) YouTube
    Tuesday, October 3
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»‘పుకార్ షికార్’ అంటే ఇదే మరి! జనగామలో ఏం జరిగిందంటే?!

    ‘పుకార్ షికార్’ అంటే ఇదే మరి! జనగామలో ఏం జరిగిందంటే?!

    March 6, 20203 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 c4

    ‘పుకారు షికారు చేసింది’ అనే వాక్యాన్ని మనం వింటుంటాం…. పలు సందర్భాల్లో పత్రికల్లో చదువుతుంటాం కూడా. కానీ పుకారు షికారు ఎలా చేస్తుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఘటన ఇది. జనగామ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సుమారు మూడు రోజుల క్రితం దుబాయ్ నుంచి తన ఇంటికి వచ్చాడు. రాత్రి పూట కాస్త దగ్గు వచ్చేసరికి, తాజా పరిస్థితులు, పరిణామాలను బేరీజు వేసుకుని అందుబాటులో గల ఓ ఆర్ఎంపీ వైద్యుని వద్దకు వెళ్లాడు. తనకు దగ్గు వస్తోందని చెప్పాడు. తన వద్దకు వచ్చిన వ్యక్తికి చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీ వైద్యుడు తన అసలు డ్యూటీని మరచి ‘ఓహో నువ్వు దుబాయ్ నుంచి వచ్చావ్ కదూ? అయితే ప్రభుత్వాసుపత్రికి వెళ్లు’ అని ఉచిత సలహా పడేశాడు. గత్యంతరం లేక దుబాయ్ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.

    తనకు దగ్గు వస్తోందని, కాస్త సందేహంగా ఉందని అక్కడ గల వైద్య సిబ్బందికి దుబాయ్ వ్యక్తి చెప్పాడు. ‘అసలు నీకెందుకు డౌటు వచ్చింది?’ అని ప్రభుత్వ వైద్యులు అతన్ని ప్రశ్నించారు. తాను దుబాయ్ నుంచి ఇటీవలే వచ్చానని, అందుకే అనుమానంగా ఉందని అతను చెప్పాడు. ‘ప్రస్తుతానికైతే ఎటువంటి అనుమానం లేదు… ఇది సాధారణ దగ్గుగానే భావిస్తున్నాం… కానీ తీరిక దొరికితే ఓసారి హైదరాబాద్ వెళ్లి టెస్ట్ చేయించుకోకూడదా?’ అని ఆసుపత్రి వైద్యులు అతనికి సూచించారు. అతనూ సరేనన్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. వైద్యుల సలహాను కూడా తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ ఈ సీన్ మొత్తం తిలకిస్తున్న ప్రభుత్వాసుపత్రి సిబ్బందిలో ఎవరో ఘటనను మీడియాకు లీక్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి గురించి ఉప్పందించారు. ఇంకేముంది యూ ట్యూబ్ ఛానళ్లు,  ఆ ట్యూబ్ ఛానళ్లు, ఇంకా ఏవేవో ఛానళ్ల పేరుతో మీడియా వాళ్లు పోలోమంటూ రానే వచ్చారు. వచ్చిందే తడవుగా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి గురించి టాం టాం చేశారు. జనగామలో కరోనా కలకలం, దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు సారాంశంతో సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు. మీడియా ధాటికి కంగారుపడిపోయిన దుబాయ్ వ్యక్తి తన ఇంటికి వెళ్లిపోయాడు.

    ts29 IMG 20200306 WA0016
    దుబాయ్ వ్యక్తి కుటుంబాన్ని అంబులెన్స్ ఎక్కిస్తున్న దృశ్యం

    కానీ హైదరాబాద్ నుంచి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, అధికారుల నుంచి జనగామ వైద్య సిబ్బందికి ఒకటే ఒత్తిళ్లు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి? వెంటనే గాంధీ ఆసుపత్రికి పంపండి’ ఇదీ ఒత్తిళ్ల సారాంశం. జనగామ ప్రభుత్వాసుపత్రి వైద్యులు రంగంలోకి దిగక తప్పలేదు. వైద్య చికిత్సకు సహకరించాలని దుబాయ్ వ్యక్తికి సూచించారు. ఆసుపత్రికి రావాలని కోరారు. తనకు వచ్చింది కేవలం దగ్గు మాత్రమేనని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, అయినప్పటికీ కరోనా పరీక్షకు తాను సిద్ధమని దుబాయ్ వ్యక్తి అంగీకరిస్తూ ఓ షరతు విధించాడు. తాను జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి రానని, అంబులెన్స్ తన ఇంటి వద్దకు పంపితే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెడతానని, కానీ మీడియా వాళ్లు మాత్రం ఎవరూ తన ఇంటికి రావద్దని దుబాయ్ వ్యక్తి స్పష్టం చేశారు. దీంతో అంబులెన్స్ ను దుబాయ్ వ్యక్తి ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్యులు పంపారు. కానీ మీడియా అక్కడికీ చేరుకుంది.(ఇంతకు ముందు పోస్టులో సదరు దుబాయ్ వ్యక్తి మాట్లాడుతున్న వీడియో ఆ బాపతే.) మళ్లీ ఫొటోలు తీసింది? హడావిడి చేసింది? ఆసుపత్రి నుంచి పారిపోయాడని ప్రచారం చేసింది.

    మొత్తం పరిణామాల్లో దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తినే కాదు, అతని కుటుంబానికి చెందిన మొత్తం తొమ్మది మంది సభ్యులను కూడా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు అంబులెన్సులో పంపించారు. ‘ఎల్లమ్మ’ దేవతను కొల్చుకునే ప్రక్రియలో భాగంగా దుబాయ్ వ్యక్తి తన ఇంటి వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఓ పుకారు షికారు చేసిన ఫలితంగా, అతనితోపాటు మొత్తం తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ప్రస్తుతం కరోనా’ వార్డుకు తరలక తప్పలేదు. వారం రోజులపాటు కరోనా (ఐసొలేషన్) వార్డులో అతని కుటుంబం ఉండడం అనివార్యం. పుణే నుంచి రక్త పరీక్షల నివేదికలు రావడానికి పట్టే కనీస వ్యవధి ఇది. వారం తర్వాత దుబాయ్ వ్యక్తి కుటుంబానికి ‘నెగిటివ్’ రిపోర్టులే రావచ్చు. అలాగే రావాలని ఆకాంక్షిద్దాం. కానీ కేవలం ‘దగ్గు’ అనే కారణంతో ఆసుపత్రికి వచ్చిన పాపానికి దుబాయ్ వ్యక్తిని, అతని కుటుంబాన్ని ‘ఐసొసేషన్’ వార్డు వరకు తరలించిన ‘పుకారు’కు బాధ్యులెవరన్నదే అసలు ప్రశ్న. విషయాన్ని లీక్ చేసిన ప్రభుత్వాసుపత్రి సిబ్బందిదా? అదిగో దగ్గు అంటే… ఇదిగో ‘కరోనా’ అంటూ ప్రచారం చేసిన మీడియాదా? ఎవరు బాధ్యత వహించాలి…?

    Previous Articleనిగ్గదీసి అడిగెయ్… ఇంకా కడిగెయ్… ఈ సిగ్గులేని మీడియాను…!
    Next Article ‘కరోనా’కు వెరవని మంత్రి… పాజిటివ్ పేషెంట్ వద్దకు వెళ్లిన వీడియో!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.